తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:05 AM
గ్రామాల్లో తాగు నీటిఎద్దడి తలెత్తకుండా జాగ్రతలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో తాగు నీటిఎద్దడి తలెత్తకుండా జాగ్రతలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లిలో మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి గృహ్రపవేశం వేడుకలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు అఽధికారంలో ఉన్నా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. జాతీయ రహదారి నుంచి ఇస్రంపల్లి, పెద్ద మునగల్చేడ్ మీదుగా కౌకుంట్ల వరకు రహదారి నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వెంకంపల్లి నుంచి రేకులంపల్లి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 1.80 కోట్లు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి 13 సబ్స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, శివకుమార్, నాయకులు ఆరవింద్కుమార్రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.