రాజకీయ రగడ
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:07 AM
ఎల్‌నినో పరిస్థితులు.. అధికారుల ప్రణాళికలే నితనం.. ప్రజాప్రతినిధుల దుందుడుకు వైఖరి, పోలీసుల అత్యుత్సాహం.. వెరసి.. రాజకీయ రగడ మొదలైంది.
- రైతులపై కేసులు నమోదు చేయడంపై ప్రతిపక్షాల ప్రశ్న
- ఇప్పటికే సాగునీటి విడుదల విషయంలో చాలా సవాళ్లు
- రైతుభరోసా, బీమా, నీటి విషయంలో రైతుల్లో అసంతృప్తి
- వానాకాలం నుంచే రైతాంగం కోణంలో బీఆర్‌ఎస్ కార్నర్
- సమస్య లేదంటూనే ఉచ్చులో చిక్కుతున్న కాంగ్రెస్ నాయకులు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఎల్‌నినో పరిస్థితులు.. అధికారుల ప్రణాళికలే నితనం.. ప్రజాప్రతినిధుల దుందుడుకు వైఖరి, పోలీసుల అత్యుత్సాహం.. వెరసి.. రాజకీయ రగడ మొదలైంది. వానాకాలం నుంచే రైతాంగం, నీటి విషయంలో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసుకుంటూ వస్తున్న బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రభు త్వం ఆయుధాలు ఇస్తూనే ఉంది. తాజాగా జూరాల నుంచి నీటి విడుదలకు ఽప్రయత్నించిన రైతులపై డీఈఈ ఫిర్యాదుతో కేసులు నమోదు చే యడంతో రాజకీయ మంటలు మరింత చెలరేగాయి. ఈసారి బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా గళాన్ని పెంచింది. రైతులు, వారి పక్షాన పోరాడుతున్న బీజేపీ నాయకులు భయపడబోరని ఎంపీ డీకే అరుణ ప్రకటించగా.. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి నేరుగా ఆత్మకూరుకు వెళ్లి రైతులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వంపై, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే గత నెల 20వ తేదీన కేసు నమోదైనప్పటికీ గురువారం వరకు బయటకు రానివ్వలేదు. రైతులకు కూడా తమపై కేసులు నమోదైనట్లు తెలియలేదు. నమోదైనవి నాన్ బెయిలబుల్ కేసులు అయినప్పటికీ రైతులను అరెస్టు చేస్తే రాజకీయ దుమారం రేగుతుందనే సంయమనం పాటించారు. అయితే ఎవరో దీన్ని లీక్ చేయడంతో విషయం బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. దాన్ని అలాగే స్తబ్దుగా ఉంచాలని భావించడం వల్లనే అరెస్టులు చేయలేదని సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి నా.. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు దాని చుట్టూ రాజకీయాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతుండటంతో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. లేకపోతే మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి వచ్చేదనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది.
ఆర్డీఎస్ నుంచి మొదలు..
వానాకాలం సీజన్ ప్రారంభంలోనే ఆర్డీఎస్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ బృందం.. అక్కడ 2 టీ ఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కురుడి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించింది. అక్రమ ప్రాజెక్టు ను కావాలనే అడ్డుకోవడం లేదని కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసింది. ఆ తర్వాత జూలై చివరి వరకు నీరు రాకపోవడాన్ని గుర్తించి.. కర్ణాటకలోని గిరిజాపూర్, గూగుల్‌లాంటి బ్యారేజీల నుంచి నీటిని కర్ణాటక కట్టడి చేస్తోందని విమర్శించింది. ఆ తర్వాత జూరాల నుంచి దిగువకు నీటి విడుదల చేసిన సమయంలో ఆంధ్రాకు నీరు పోతోం దనే వాదన ఎత్తుకుని.. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టింది. ఎడమ, కుడి కాలువల దగ్గర ధర్నాలు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే జరిగాయి. సాగునీటి విడుదలను నిలిపివేయడంతో గత నెలలో బీఆర్‌ఎస్, ఇతర పార్టీల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలో జరిగిన ఘటనల వల్లే ప్రస్తుతం కొందరు నాయకులు, రైతులపై కేసులు నమోదు చేయడమని చెప్పవచ్చు. ఇవే కాకుండా విద్యుత్ సమస్యలపై ధర్నాలు, సబ్ స్టేషన్ల సందర్శనలు, మోటార్ మెకానిక్ దుకాణాల్లో పరిస్థితులపై అ ధ్యయనం చేయడం వంటివి అనేకం చేశారు. తాజాగా రైతులపై కేసులు నమోదు చేశారని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభం నుంచే రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ట్రిగర్ చే స్తూ వస్తోంది. బీజేపీ కూడా విద్యుత్ సరఫరా, నీటి పంపిణీ విషయంలో పలుచోట్ల నిరసనలకు దిగింది. ఎంపీ డీకే అరుణ, గద్వాల పార్టీ ఇన్‌చార్జి స్నిగ్ధారెడ్డి తదితరులు కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి.
ట్రాప్‌లో పడి బదనాం..
ప్రతీసారి సమస్యలు లేవంటూనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడి బదనాం అవుతున్నారనే భావన కలుగుతోంది. ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలోనే వానాకాలం పంటలకు సాగునీరు ఇవ్వ లేమని, ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసుకోవాలని నిర్ణయించారు. గ్రామసభలు కూ డా నిర్వహించారు. అయితే వరద వచ్చినప్పుడు దిగువకు నీటి విడుదల చేయడంతో ఆంధ్రాకు నీరు పోతోందని, రైతులకు విడుదల చేయడం లేదని బీఆర్‌ఎస్ ఇరకాటంలో పెట్టగా.. పంట చివరి వరకు నీరివ్వలేమని తెలిసి కూడా ఆ ట్రాప్‌లో పడి నీటిని విడుదల చేయించారు. ఆ తర్వాత ఇటీవల తాగునీటి అవసరాల దృష్ట్యా నీటి విడుదలను నిలిపివేయడంతో బీఆర్‌ఎస్ మళ్లీ నీళ్లున్నా ఇవ్వడం లేదని విమర్శలు మొదలుపెట్టింది. ఉన్న నీటిని విడుదల చేసి, తర్వాత సమస్య వచ్చే ముందు కర్ణాటకతో సంప్రదింపు లు జరపాల్సి ఉండగా.. ముందస్తుగానే చర్చలు జరిపి.. మూడు టీఎంసీలకు ఒప్పందం తెచ్చుకున్నారు. కర్ణాటక నీరు రావడం లేదని ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శిస్తుంటే... నవంబర్ 30 వరకు సమయం ఉందని, అవసరాన్ని బట్టి వినియోగించుకుంటామని కూడా చెప్పడం లేదు. ఎల్‌నీనో ప్రభావం కంటే ఈసారి కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా నాయకులపై బీఆర్‌ఎస్ ట్రాప్ ప్రభావమే అధికంగా పనిచేసిందని చెప్పవచ్చు.