Share News

బీసీ రాజ్యాధికారమే లక్ష్యం

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:28 PM

వచ్చే ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క బీసీ బిడ్డ ఐక్యం కావాలని, రాబోయే ఎన్నికల్లో ఒక్క రెడ్డి ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు.

బీసీ రాజ్యాధికారమే లక్ష్యం
నారాయణపేటలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

- ఒక్క రెడ్డి ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను

- ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

నారాయణపేట క్రైం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క బీసీ బిడ్డ ఐక్యం కావాలని, రాబోయే ఎన్నికల్లో ఒక్క రెడ్డి ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రం నుంచి నారాయణపేటకు పాదయాత్రగా బయలుదేరిన ఆయన దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి వీరభధ్రస్వామిని దర్శించుకొని నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తాలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జానాభా ఉన్న బీసీలకు మాత్రం బీసీ ఎమ్మెల్యేలు లేకపోవడం బాధాకరమన్నారు. కానీ, రాష్ట్రంలో సుమారు 10 లక్షల జనాభా ఉన్న రెడ్డీలు మాత్రం 43 మంది ఎమ్మెల్యేలుగా ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. నారాయణపేట నియోజకవర్గంలో సుమారు 2లక్షల 32వేల మంది జనాభా ఉంటే అందులో కేవలం 10 వేల మంది మాత్రమే రెడ్లు ఉన్నారని, అత్యధికంగా బీసీలు లక్షా 56వేల పైచిలుకు జనాభా ఉన్నా ఇక్కడ బీసీ ఎమ్మెల్యే ఎందుకులేరని ప్రశ్నించారు. నారాయణపేట - మక్తల్‌ - కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పేరుతో అక్రమంగా డబ్బులు దోచుకుంటున్న వారి చిట్టా తన వద్ద ఉన్నదన్నారు. నియోజకవర్గంలో బీసీలను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోనని అన్నారు. పాదయాత్రలో భాగంగా పేట ముదిరాజ్‌ నాయకులు తెలంగాణలో ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చేలా చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో శివవీర్‌రెడ్డి, మడివాల్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:28 PM