రేపల్లిలో కొనసాగుతున్న పోలీస్ పికెట్
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:42 PM
జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లి గ్రామంలో ప్రేమ వివాహంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటి కూల్చివేతతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శుక్రవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగుతోంది.
- నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దళిత సంఘాలు
- పునరావృతం కాకుండా చూడాలన్న మానిటరింగ్ కమిటీ
గద్వాల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లి గ్రామంలో ప్రేమ వివాహంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటి కూల్చివేతతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శుక్రవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరినీ గ్రామంలోకి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలోని పది మంది పోలీసులు కూల్చివేసిన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు కూడా సంఘటనపై నోరుమెదపకుండా ఎవరిపనిలో వారు నిమగ్నమయ్యారు. కాగా రంగముని, మహేశ్వరిలు ప్రేమ వివాహం చేసుకోవడంతో దళిత కుటుంబం ఇంటిని కూల్చివేయడంతో దళిత సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మణికుమార్ పార్టీ శ్రేణులతో కలిసి కూల్చివేసిన ఇంటిని పరిశీలించారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కుర్మన్న సంఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులను అరెస్టుచేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాదిత కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం చెల్లించాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్‌లు సంఘటను తీవ్రంగా ఖండించారు.
నిందితులపై ఎస్సీఎస్టీ ఆట్రాసిటీ కేసు నమోదు
ప్రేమ వివాహంతో రంగముని ఇంటిని కూల్చివేయడంతో పోలీసులు నిందితులపై ఇంటి కూల్చివేత, ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసును నమోదు చేశారు. కూల్చివేత సంఘటనలో పాలుపంచుకున్న ఆరుగురిని గుర్తించారు. అందులో పరుష, రామాంజి, తిమ్మన్న, వెంకటేష్, పరుషరాముడుని అరెస్టు చేశారు.