పచ్చని పంటలపై విషం
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:38 PM
చెరుకు తోటకు పిచికారీ చేసిన కలుపు నివారణ మందు చుట్టుపక్కల పొలాల్లోని ఇతర పంటలను దెబ్బతీసింది.
- చెరకు తోటకు కలుపు నివారణ మందు పిచికారి
- కిలోమీటరున్నర వరకు ప్రభావం
- వాడిపోయిన ఇతర పంటలు
- బొంకూరు గ్రామ రైతుల ఆందోళన
ఉండవల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : చెరుకు తోటకు పిచికారీ చేసిన కలుపు నివారణ మందు చుట్టుపక్కల పొలాల్లోని ఇతర పంటలను దెబ్బతీసింది. దాదాపు 75 ఎకరాల్లో పంటలు వాడుపట్టాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం, బొంకూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కొత్తకోట వద్దనున్న ఓ షుగర్‌ఫాక్టరీ వారితో కలిసి దాదాపు 70 ఎకరాల్లో చెరుకు పంట వేశారు. తోటలో సస్యరక్షణ చర్యలకు ఆవసరమైన మందులను సదరు కంపెనీయే సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా ఓ ఇద్దరు రైతులకు యూపీఎల్ పేరుతో ఉన్న ట్రిస్కెల్ కలుపునివారణ మందులను షుగర్ కంపెనీ వారే ఇచ్చారు. సదరు రైతులు ఆ ద్రావణాన్ని చెరకుతోటలో పిచికారీ చేశారు. ఆ మందు గాలివాటం వైపు దాదాపు కిలోమీటరున్నర మేర వ్యాపించింది. దీంతో ఆ తోటకు తూర్పువైపున ఉన్న పత్తి, కంది, మిరప పంటలు దెబ్బతిన్నాయి. గమనించిన రైతులు మంగళవారం పంటలను పరిశీలించారు. పత్తి, కంది మొక్కల కొనలు పాలిపోయి, ఎండుముఖం పట్టినట్లు గుర్తించారు. రైతు మల్లికార్జున్‌కు సంబంధించిన మిరప నారుమడి దెబ్బతిన్నది. దీంతో ఎకరానికి రూ.30వేల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బాధిత రైతులు కె.కృష్ణ, నాగేష్, దేవేందర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, లోకేశ్వరరెడ్డి, సాంబశివుడు, సుధాకర్‌రెడ్డి, హరికృష్ణ, రవి, రాముడు, రామకృష్ణ, మహేంద్ర వాపోయారు. ఎకరానికి రూ. 25వేల నుంచి రూ. 30 వేల దాక వెచ్చించి పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని తెలిపారు. సంఘటనపై అధికారులు విచారణ చేపట్టి కంపెనీ వారి నుంచి పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై సదరు కంపెనీ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
లక్ష రూపాయలు నష్టం
ఈ ఏడాది మిరపసాగు కోసం ఎకరం రూ.30 వేల చొప్పున భూమని కౌలుకు భూమి తీసుకున్నాను. 10 గ్రాముల ప్యాకెట్‌కు రూ.800 చొప్పున వెచ్చించి 55 ప్యాకెట్ల బ్యాడిగి మిరప విత్తనాలతో నారుమడి పోశాను. మరో 20 రోజుల్లో నారు చేతికి వచ్చేది. కానీ ట్రిస్కెల్ మందు ప్రభావంతో నారుమడి ఎండిపోయింది. దాన్ని కాపాడుకునేందుకు మందులు పిచికారి చేస్తున్నాను. ఇప్పటివరకు లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు?
- కే. మల్లికార్జున్, బొంకూరు
పంటలను పరిశీలిస్తాం..
మందులు సరఫరా చేసే షుగర్ ఫ్యాక్టరీ వారు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడమే కష్టం. అలాంటిది మానవ తప్పిదంతో నష్టం జరిగితే రైతులు కోలుకోలేరు. పంటలను పరిశీలించి ఆవసరమైన చర్యలు తీసుకుంటాం.
- సుబ్బారెడ్డి, ఇన్‌చార్జి వ్యవసాయ సంచాలకుడు, అలంపూర్