‘పేట’ చేనేత చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:08 PM
నారాయణపేట చేనేత చీరలకు, సంప్రదాయ హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం నేత కార్మికులు భౌగోళిక సూచిక(జీఐ) సర్టిఫికేట్ పొందాలని జీఐ అధీకృత యూజర్ సీఈఓ తేజస్ అన్నారు.
జీఐ సర్టిఫికెట్ పొందడం వల్ల ప్రాముఖ్యత తెలుస్తుంది
భౌగోళిక సూచిక అధీకృత యూజర్ సీఈఓ తేజస్
నారాయణపేట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట చేనేత చీరలకు, సంప్రదాయ హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం నేత కార్మికులు భౌగోళిక సూచిక(జీఐ) సర్టిఫికేట్ పొందాలని జీఐ అధీకృత యూజర్ సీఈఓ తేజస్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్‌ఆర్ గార్డన్‌లో కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం సహకారంతో నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ వారు నేత కార్మికుల కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్ మాట్లాడుతూ పేట చేనేత పట్టు, కాటన్ చీరల ఉత్పత్తులకు సంబంధించి శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. కార్మికులు జీఐ రిజిస్ర్టేషన్ చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి బ్రాండ్ విలువను పెంచడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఎగుమతులు పెరిగి హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను పెంచుతుందన్నారు. చేనేత ఉత్పత్తులకు విలువను జోడిస్తుందన్నారు. జీఐ సర్టిఫికేషన్ ద్వారా నేత కళాకారులను మరింత శక్తివంతం చేయడంతో పాటు సంప్రదాయాలతో కూడిన విలువలు, నేతదారుల పద్ధతులను రక్షించుకోవచ్చన్నారు. అంతర్జాతీయంగా మార్కెట్‌లో కొత్త అవకాశాలను సృష్టించడం సాధ్యమౌతుందన్నారు. నారాయణపేట చేనేత చీరల గొప్ప వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక బ్రాండింగ్, మార్కెటింగ్ అవకాశాలను స్వీకరించడానికి తమ కట్టుబాట్లను వివరించారు. కార్యక్రమంలో రీజినల్ ఇన్‌చార్జి బీఎన్ గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ బాబు, టెక్నికల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.