Share News

జ్వరాల బారిన జనం

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:28 PM

మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రజలు సీజనల్‌ వ్యాఽఽఽధుల బారిన పడి అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు వస్తుండటంతో అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పరిస్థితి బాధాకరంగా ఉంది.

జ్వరాల బారిన జనం
నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రిలో అవుట్‌ పేషెంట్ల నమోదు కోసం బారులు తీరిన మహిళలు

- కందనూలును కుదిపేస్తున్న వ్యాధులు

- సీజనల్‌ వ్యాధులతో అల్లాడుతున్న జనం

- చిన్న పిల్లలు, వృద్ధులకు ఛాతీ సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు

- రోగులతో కిటకిటలాడుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రి

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రజలు సీజనల్‌ వ్యాఽఽఽధుల బారిన పడి అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు వస్తుండటంతో అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పరిస్థితి బాధాకరంగా ఉంది. చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాల్సి ఉండగా ఎల్‌నినో ప్రభావం కారణంగా క్రమంగా పెరుగుతుండటంతో వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతీ ఇంట్లో కనీసం ఒకరు లేదా ఇద్దరు వైరల్‌ జ్వరాలు, ఛాతీ సంబంధమైన ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కన్పిస్తోంది.

కిటకిటలాడుతున్న సర్కార్‌ ఆసుపత్రులు

జిల్లా కేంద్రంలో 350పడకల సామర్థ్యం గల ఆసుపత్రితో పాటు కొల్లాపూర్‌, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. గడిచిన 15రోజులుగా పరిస్థితి తెలుసుకోవడానికి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ఆసుపత్రులను విజిట్‌ చేసింది. ప్రతీ ఆసుపత్రిలో సీజనల్‌ వ్యాఽధుల బారిన పడి వచ్చిన వారి సంఖ్య అధికంగా కన్పించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ఉదయం 8గంటల నుంచే అవుట్‌ పేషెంట్లు బారులు తీరారు. ప్రతీ రోజు సాధారణ ఓపీ 300-500 ఉండాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల్లో మార్పుకారణంగా రోగుల సంఖ్య 10 రోజుల్లో 6, 151 మంది చేరడం గమనార్హం. 26వ తేదీన 967మంది, 27న 949మంది అవుట్‌పేషెంట్లు ఆసుపత్రిలో చూపించుకోవడం గమనార్హం. వీరిలో ఆసుపత్రికి వచ్చిన అవుట్‌ పేషెంట్లలో వైరల్‌ జ్వరాలు, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలతో వచ్చిన వారి సంఖ్యనే అధికంగా ఉంది. కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అవుట్‌పేషెంట్ల సంఖ్య పెరిగింది. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 9గంటల వరకే దాదాపు 450మంది అవుట్‌ పేషెంట్‌లుగా నమోదు చేసుకున్నారు. అందులో 55మంది చిన్నారులు, 265మంది జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో చూపించుకున్నారు. అచ్చంపేట 100పడకల ఆసుపత్రిలో గడిచిన పది రోజుల నుంచి అవుట్‌ పేషెంట్ల సంఖ్య 280 నుంచి దాదాపు 450వరకు నమోదవుతూ వస్తుంది. అచ్చంపేట ఆసుపత్రిలో ప్రధానంగా చిన్నారులు ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న కేసులే అధికంగా వస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. సీజనల్‌ వ్యాధులతో సామాన్య ప్రజలు సర్కార్‌ ఆసుపత్రుల్లో చేరుతుండగా మధ్య తరగతికి చెందిన వారు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.

మరో మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి

- డాక్టర్‌ సుప్రియ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. దీని పర్యవసానంగా సీజనల్‌ వ్యాధులు అతివేగంగా ప్రబలుతున్నాయి. వైరల్‌ జ్వరాలు, ఛాతీ సంబంధమైన ఇన్‌ఫెక్షన్లను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. పసిపిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలి. జిల్లా ఆసుపత్రిలో పెరుగుతున్న అవుట్‌పేషెంట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరమైన వైద్య సదుపాయాలన్నింటినీ సిద్ధంగా ఉంచాం. సిబ్బందిని కూడా అప్రమత్తం చేశాం. సీజనల్‌ వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులన్నీ కూడా ఉన్నాయి. దీనికి ఎలాంటి కొరత లేదు.

Updated Date - Oct 30 , 2026 | 11:28 PM