పారాక్వాటేస్తోంది
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:26 PM
పార్వాకాట్ డైక్లోరైడ్ మందు ప్రజల ఉసురు తీస్తోంది. దీనిని రైతులు పంట పొలాల్లో కలుపు మొక్కలను నివారించేందుకు వినియోగిస్తున్నారు. ఇది విచ్చలవిడిగా విక్రయిస్తుండటంతో రైతులు కూడా అదేస్థాయిలో తీసుకెళ్లి పిచికారి చేస్తున్నారు. అయితే ఈ మందు వాడే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రాణాలు తీస్తున్న గడ్డిమందు
పారాక్వాట్ 10 మిల్లీ లీటర్లు తాగినా ప్రాణాలు హరీ..
ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారిలో ఈ మందు తాగిన వారే అధికం
ఈ పెస్టిసైడ్ వల్ల జిల్లాలో 2021 నుంచి ఇప్పటి వరకు 18 మంది మృతి
ప్రాణాంతకమని భావించి రెండు నెలలు నిషేధించిన ప్రభుత్వం
పార్వాకాట్ డైక్లోరైడ్ మందు ప్రజల ఉసురు తీస్తోంది. దీనిని రైతులు పంట పొలాల్లో కలుపు మొక్కలను నివారించేందుకు వినియోగిస్తున్నారు. ఇది విచ్చలవిడిగా విక్రయిస్తుండటంతో రైతులు కూడా అదేస్థాయిలో తీసుకెళ్లి పిచికారి చేస్తున్నారు. అయితే ఈ మందు వాడే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, పార్కిన్సన్స్ అనే వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా క్షణికావేశంలో ఈ మందు తాగి హత్యాయత్నానికి పాల్పడుతున్నారు. దీంతో ఇది నాడి వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, చ ర్మం, కళ్లపై ప్రభావం పడుతుందని వైద్యులు అం టున్నారు. ఇది ఒక్క 10 మిల్లీ లీటర్లు తాగి నా ప్రాణాలు దక్కే అవకాశం ఏమాత్రం ఉండదని, 95 నుంచి 98 శాతం మంది చికిత్స పొందుతూ చనిపోతున్నారని పేర్కొంటున్నారు. దీనికి విరుగుడు లేదని ఆ మందు డబ్బాపై కూడారాసి ఉంటుందని చెబుతున్నారు.
ఆత్మహత్యాయత్నాల్లో గడ్డిమందు కేసులే అధికం..
క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వారిలో గడ్డిమందు తాగి న వారే ఎక్కువగా ఉంటున్నారు. భూ త్పూర్ మండలానికి చెందిన ఓ వివాహి త కుటుంబ కలహాల కారణంగా 2022 లో గడ్డిమందు తాగింది. ఇప్పటికీ ఆమె జీవచ్ఛవంలా జీవనం సాగిస్తోంది.
మక్తల్ మండలానికి చెందిన ఓ యువకుడు 2024లో తండ్రి మందలించాడని గడ్డిమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. చికిత్సపొందుతూ మరణించాడు. ఇలా ఆత్మహత్య చేసుకున్న వారిలో గడ్డి మందు తాగిన వారే అధికంగా ఉంటున్నారు. ఆ మందు తాగి చికిత్స తీసుకుంటున్నప్పటికి వారు బతికి ఉన్న శవంలాగానే ఉంటున్నారు. శరీరమంతా అస్తిపంజరం గూడులాగా మా రుతోంది. ఇలా బతికిన వారిలో కేవలం 2 శాతం మంది మాత్రమే ఉంటారని వైద్యులు అంటున్నారు.
ఐదేళ్లలో 18 మంది మృతి
జిల్లా వ్యాప్తంగా 2021 నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలో జనరల్ ఆసుపత్రిలో నమోదైన ఆత్మహత్య కేసుల్లో 18 మంది గడ్డిమందు తాగే చనిపోయారు. 118 మంది చికిత్స తీసుకున్నారు. ఈ కేసులు జనరల్ ఆసుపత్రిలోనే నమోదు కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 20 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిషేధం
ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్న ఈ గడ్డి మందును 50 దేశాల్లో నిషేధించారు. మన రాష్ట్రంలో నిషేధించకపోవడంతో రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివలన ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని గ్రహించిన ప్రభుత్వం ఈ మందు విక్రయాలపై దృష్టి సారించింది. ఈ మందు అవసరం ఉన్నవాళ్లు వ్యవసాయాధికారులతో అనుమతి తీసుకొని చీటి తీసుకున్న తర్వాతనే ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అది ఆచరణలో అమలు కావడం లేదు. తాజాగా ప్రభుత్వం ఈ మందును రెండు నెలల పాటు నిషేధించాలని అసెంబ్లీలో తీ ర్మానం చేసింది. అయితే ప్రాణాంతకమైన ఈ మందును పూర్తిగా నిషేధించాలని బాధిత కుటుంబీకులు, వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.