Share News

వరుస ప్రమాదాలతో బెంబేలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:22 PM

మండలంలోని జానంపేట 44వ జాతీయ రహదారిపై ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఇటు ప్రయాణికులు, అటు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.

 వరుస ప్రమాదాలతో బెంబేలు
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం (ఫైల్‌)

- నెలల తరబడి అసంపూర్తిగానే సబ్‌రోడ్డు పనులు

- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు

మూసాపేట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని జానంపేట 44వ జాతీయ రహదారిపై ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఇటు ప్రయాణికులు, అటు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలోనే మూడు రోజుల పాటు వరుస ప్రమాద సంఘటనలు తలెత్తి డీసీఎం, మినీ టూరిస్టు, ట్రాయిలర్‌ వాహనాలు ఢీ కొన్నాయి. అండర్‌ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రోడ్డును డైవర్షన్‌ చేసి సబ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు తికమకపడుతూ ఆకస్మికంగా డివైడర్‌తో పాటు ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రమాదాల బారిన పడటంతో ఈ ప్రదేశం యాక్సిడెంట్‌ స్పాట్‌ జోన్‌గా మారింది. అయినప్పటికీ అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం సంకలమద్ది (వేముల స్టేజీ), జానంపేట వద్ద అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ఇరువైపులా సబ్‌రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కంకర పరిచి 9 నెలలు గడిచినా నేటికీ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగానే ఉండటంతో దుమ్ము, ధూళితో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేముల స్టేజీ వద్ద బస్సులు, ఇతర వాహనాలు సబ్‌రోడ్డుపైనే పార్కింగ్‌ చేయడంతో వెనక నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్‌ సమస్య తలెత్తి ఒక్కోసారి అర గంటకుపైగా వాహనాలు స్తంభించిపోవడంతో అత్యవసరంగా వెళ్తే వాహనాలకు ఆటంకం కలుగుతోంది. నిర్మాణ పనుల్లో భాగంగా బస్సుస్టాప్‌లను తొలగించడంతో గంటల తరబడి ప్రయాణికులు సబ్‌రోడ్డుపై వేచి ఉంటున్నారు. సీసీ కెమరాలు ఏడాది కాలంగా పనిచేయడం లేదని, ఇక్కడ ఏదైన గుర్తు తెలియని వాహనాలు ఢీ కొట్టినా వాటిని చూడటానికి వీలు లేకుండా పోయిందన్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:22 PM