Share News

టీజీ-20లో పాలమూరు కుర్రాళ్లు

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:34 PM

రాష్ట్రంలో తొలిసారిగా బీసీసీఐ ఆమోదంతో టీజీ-20 పోటీలు జరుగుతున్నాయి.

టీజీ-20లో పాలమూరు కుర్రాళ్లు

- వేలంలో మెరిసిన ఉమ్మడి జిల్లా ఆటగాళ్లు

- అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడనున్న మన వాళ్లు

- అత్యధికంగా రూ. 3.25 లక్షలు పలికిన గణేశ్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో తొలిసారిగా బీసీసీఐ ఆమోదంతో టీజీ-20 పోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 20 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ టీ-20 (టీజీ-20) లీగ్‌ పోటీలకు ఇటీవలే హైదరాబాద్‌లో వేలం ప్రక్రియ నిర్వహించారు. అందులో జిల్లా క్రికెటర్లకు ప్రాధాన్యం దక్కింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ), మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా, రాష్ట్రస్థాయి ఏ, బీ - డివిజన్‌ స్థాయి పోటీల్లో పాలమూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. స్టార్‌ క్రికెటర్లు తిలక్‌ వర్మ, మహ్మద్‌సిరాజ్‌లు పాల్గొననున్న ఈ మెగా లీగ్‌కు ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు యువ క్రికెటర్లు ఎంపికవడంపై హర్షం వ్యక్తమవుతోంది.

‘హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌’కు గణేశ్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన గణేశ్‌ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. గత ఏడాది ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్‌ 2వ కౌంటీలో అతడు చోటు సంపాందించాడు. 2024లో ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు. 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మిజోరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హెచ్‌సీఏ జట్టు తరుపున పాల్గొన్నాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే 3డే, 2డే లీగ్‌ టోర్నీలతో పాటు ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో రాణించాడు. హెచ్‌సీఏ టోర్నీలో వెయ్యికి పైగా పరుగులు, డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలతో సత్తా చాటాడు. ఈయనను రూ.3.25 లక్షలు వెచ్చించి హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ జట్టు దక్కించుకున్నది.

బౌలర్‌ అరుణ్‌కుమార్‌

గద్వాలకు చెందిన టి. అరుణ్‌కుమార్‌ బౌలర్‌గా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. హెచ్‌సీఏ నిర్వహించిన టూడే లీగ్‌, రాష్ట్ర స్థాయి మ్యాచుల్లో బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. 2024లో అన్ని ఫార్మట్లలో 65 వికెట్లు, 2025లో హెచ్‌సీఏ ఏ-డివిజన్‌ వన్‌డే, 2డే, టీ-20లో మ్యాచ్‌ల్లో 40 వికెట్లు, 2026లో 4 వికెట్లు తీసి రాణించాడు. ఇతడిని లక్ష రూపాయలకు రంగారెడ్డి రైజర్స్‌ జట్టు సొంతం చేసుకున్నది.

ఆల్‌రౌండర్‌ షాదాబ్‌అహ్మద్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన షాదాబ్‌ అహ్మద్‌ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. 2025 లో నిర్వహించిన హెచ్‌సీఏ టోర్నీలో 13 వికెట్లు, 102 పరుగులు చేశాడు. 2026 నిర్వహించిన హెచ్‌సీఏ-బి డివిజన్‌ టీ-20లో 3 వికెట్లు ఒక సెంచరీ సాధించాడు, మొత్తం 162 పరుగులు చేసి ప్రతిభ చాటుతున్నాడు. పాలమూరు స్ట్రైకర్స్‌ జట్టు రూ. 75 వేలకు షాదాబ్‌ అహ్మద్‌ను దక్కించుకున్నది.

మరో ఆల్‌రౌండర్‌ జశ్వంత్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా, తాడురుకు చెందిన జి.జశ్వంత్‌ ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటుతున్నాడు. 2025-26లో జరిగిన హెచ్‌సీఏ 2డే లీగ్‌ పోటీల్లో 8 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్ల పడగొట్టాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అయిన ఇతడు 2026 హెచ్‌సీఏ అండర్‌-19 టోర్నీలో 6, హెచ్‌సీఏ బి-డివిజన్‌ టీ-20 లీగ్‌లో 11 వికెట్లు తీసి రాణించాడు. ఈ క్రికెటర్‌ను రూ.75లు వెచ్చించి హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ జట్టు దక్కించుకున్నది.

అద్భుతమైన అవకాశం

రాష్ట్రంలో తొలిసారిగా బీసీసీఐ ఆమోదంతో టీ-20 పోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 20 నుంచి జూలై 11వ తేదీ వరకు ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించనున్న మ్యాచ్‌లలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలి. ఈ లీగ్‌ యువ క్రికెటర్లకు అద్బుతమైన అవకాశం. ఇందులో రాణిస్తే రంజీ, ఐపీఎల్‌, టీమ్‌ ఇండియా జట్టులో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

- ఎం. రాజశేఖర్‌, జిల్లా క్రికెట్‌ సంఘం సెక్రటరీ రాజశేఖర్‌

Updated Date - Jun 12 , 2026 | 11:34 PM