Share News

ప్రసవానికి పాలమూరు

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:59 PM

పాలమూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి కాన్పులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నుంచి డెలివరీ కేసులను ఈ ఆసుపత్రికే రెఫర్‌ చేస్తున్నారు.

ప్రసవానికి పాలమూరు
కిటకిటలాడుతున్న ఎంసీహెచ్‌లోని గైనిక్‌ ఓపీ

- ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నుంచి ఇక్కడికే రెఫర్‌

- ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1,191 కేసులు

- నారాయణపేట, జడ్చర్ల, వనపర్తి, వికారాబాద్‌ జిల్లాల నుంచి అత్యధికం

- 32 మంది వైద్యులకు గానూ ఉన్నది 12 మంది మాత్రమే

- మాతా, శిశు విభాగంలో డాక్టర్లు, సిబ్బందిపై పనిభారం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), అక్టోబర్‌ 21 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి కాన్పులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నుంచి డెలివరీ కేసులను ఈ ఆసుపత్రికే రెఫర్‌ చేస్తున్నారు. అత్యధికంగా నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, వికారాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే కేసులే ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న జడ్చర్ల నుంచి కూడా కేసులు అధికంగా వస్తున్నాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ కాన్పులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో సాధారణ, సిజేరియన్‌ కాన్పులు చేయాలని, అత్యవసరమైతేనే జిల్లా ఆసుపత్రులకు పంపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాని చాలా చోట్ల ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి ఉన్న కాన్పు కేసులను కూడా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికే పంపిస్తున్నారు. ఆయా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు వచ్చిన కేసులను అక్కడ పనిచేసే సిబ్బంది ఏవో ఒక కుంటి సాకులు చెప్పడం, ఏదైనా అయితే మాకేం సంబంధం లేదంటూ భయాందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం. అలాగే వైద్య కళాశాలలున్న జిల్లాల నుంచి కూడా కాన్పు కేసులు ఎక్కువగా ఇక్కడికే రెఫర్‌ చేస్తున్నారు.

వైద్యులు, సిబ్బంది పని ఒత్తిడి

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి మాతా శిశు విభాగానికి రెఫరల్‌ కాన్పు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆయా జిల్లాల నుంచి 1,191 ప్రసవాల కేసులు రెఫర్‌ అయ్యాయి. అంతేకాకుండా ఓపీ కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతీ రోజు ఓపీ 700 నుంచి 800 ఉంటుండగా, కాన్పుల సంఖ్య రోజుకు 50 నుంచి 60 వరకు ఉంటోంది. ప్రస్తుతం జనరల్‌ ఆసుపత్రిలో గైనిక్‌ డాక్టర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇటీవల జరిగిన పదోన్నతులు, బదిలీలలో చాలా మంది వైద్యులు వెళ్లిపోయారు. మొత్తం 32 మంది వైద్యులకు గాను, ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఒక ప్రెఫొసర్‌, ఒక అసోసియేట్‌, ఇద్దరు అసిస్టెంట్‌ డాక్టర్లు, మిగతా సీనియర్‌, జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, ట్యూటర్లతో నడిపిస్తున్నారు. దీంతో జనరల్‌ ఆసుపత్రి మాతా, శిశు విభాగంలోని వైద్యులు, సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. అసలే వైద్యుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతుండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల నుంచి కూడా కేసులు రెఫర్‌ అవుతుండడంతో డాక్టర్లు, సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఎక్కడి కేసులు అక్కడే చేస్తే బాగుంటుందని డాక్టర్లు, సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:59 PM