Share News

యుద్ధప్రాతిపదికన ‘‘పాలమూరు’’ పూర్తి

ABN , Publish Date - May 19 , 2026 | 11:36 PM

ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే ‘‘పాల మూరు - రంగారెడ్డి’’ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

యుద్ధప్రాతిపదికన ‘‘పాలమూరు’’ పూర్తి
పాలమూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

- వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తికి చర్యలు

- నిధుల చెల్లింపు వెంటనే జరిగేలా చూసుకుంటా..

- ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మే 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే ‘‘పాల మూరు - రంగారెడ్డి’’ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో మంగళవారం ఆయన సమావేశమై.. పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలక సూచనలు చేశారు. పీఆర్‌ఎల్‌ఐకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణను పూర్తి చేయాలని, అందుకు నిధుల చెల్లింపు ఆలస్యం చేయకుండా వెంటనే జరిగేలా చూస్తానని అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనుల పురోగతిని జిల్లా మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఇతర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు, పనుల ప్రతిపాదనలను అందజే శారు. వాటి విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం.. సమస్యల పరిష్కారం, పనుల్లో పురోగతిపై మంత్రుల ఆధ్వర్యంలో తరచూ తనను కలవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:36 PM