మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:40 PM
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని ఎస్పీ జానకి పేర్కొన్నారు. బుధవారం ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎస్‌వీఎస్ డెంటల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌తో పాటు అవగాహన వీడియోలు ప్రదర్శించారు. మాదకద్రవ్యాల భారిన పడిన వారి జీవితాలు ఎలా నాశనమవుతాయో, కుటుంబాలు, స్నేహితులు, సమాజాంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో వివరించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ పాల్గొని, మాట్లాడారు. యువత చెడు వైపు ఆకర్షితులు కావద్దని, మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఆరోగ్యంతో పాటు సమాజంలో గౌరవం కోల్పోతారని, స్నేహితుల ఆదరణ ఉండదని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ఈగల్ ఫోర్స్ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న వైద్య కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ఎస్పీ మెడల్స్ అందజేశారు. ముగ్గురు విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రోన్జ్ మెడల్స్‌తో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సంతకాలు చేసిన అప్రసియేషన్ లెటర్, యాంటీ డ్రగ్ సోల్జర్స్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈగల్ ఫోర్స్ డీఎస్పీ బుచ్చయ్య, ఎప్‌వీఎస్ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ దామోదర్‌రెడ్డి, రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.