చదవడం, రాయడం రావాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:19 PM
మహిళలు విద్యావంతులై కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయని ప్రతీ ఒక్కరికీ చదవడం, రాయడం రావాలన్నదే తన ఆకాంక్ష అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
- పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పాన్‌గల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : మహిళలు విద్యావంతులై కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయని ప్రతీ ఒక్కరికీ చదవడం, రాయడం రావాలన్నదే తన ఆకాంక్ష అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి, శాఖాపూర్ గ్రామాల్లో రేషన్ స్మార్ట్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దావూద్‌ఖాన్‌పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షలతో భూమి పూజ చేశారు. కేతేపల్లి గ్రామంలో కురువ సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5లక్షలతో భూమిపూజ చేశారు. రాయినిపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్ రూ. 10 లక్షలతో నిర్మించేందుకు భూమి పూజ చేశారు. రాయినిపల్లిలో వీవో బిల్డింగ్ రూ. 10 లక్షలతో నిర్మించేందుకు భూమిపూజ చేశారు. తెల్లరాళ్లపల్లిలో నిరక్షరాస్య మహిళలకు చదువు నేర్చుకునేందుకు మంత్రి పలకలు, బలపాలు పంపిణీ చేశారు. వీటి కొనుగోలుకు సంబంధించి గతంలోనే మంత్రి రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలోని మహిళలకు ప్రతీ రోజు ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున చదువు నేర్పించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని సర్పంచ్ జంబలయ్యకు సూచించారు. ఇందుకు తన వంతు సహాయంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. చదవడం, రాయడం, ముందుగా నేర్చుకునే మహిళకు రూ.5వేల నగదు బహుమతి అందజేస్తామని మంత్రి ప్రకటించారు. వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.