నెలకోసారి..!
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:39 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించారు.
ఎడ్యుకేషనల్ హబ్‌తో పాటు అభివృద్ధి పనుల పరిశీలన
వచ్చే ఏడాది జూన్ నాటికి పనులను పూర్తిచేసే ప్రణాళిక
మక్తల్ - నారాయణపేట - కొడంగల్‌పైనా పూర్తిస్థాయి శ్రద్ధ
కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనుకోవడం కారణమే..
ఆంధ్రజ్యోతి, మహబూబ్‌నగర్ ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబరు మధ్యలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. అందుకే ప్రతీ నెలా తానే స్వయంగా వచ్చి పనుల పర్యవేక్షణ చేస్తుండగా.. అధికారులు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. దాదాపు జూన్ నుంచి వరుసగా నెలకోసారి ఈ పర్యటనలు కొనసాగుతుండటం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో ఉంది. కొడంగల్, దౌల్తాబాద్, బొంరా్‌సపేట, దుద్యాల మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలో ఉండగా.. కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్ మండలాలు నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ కొడంగల్ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ ఏర్పాటు కాగా.. కడా అధికారిగా వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆధ్వర్వ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సీఎంఓ కార్యదర్శి శ్రీధర్, రెండు జిల్లాల కలెక్టర్లు పనుల పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లాలు రెండుగా ఉన్నప్పటికీ.. కడా మాత్రం రెండు జిల్లాల పరిధిలో పనిచేస్తోంది. తన సొంత నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ మొదలుకుని ఎడ్యుకేషనల్ హబ్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులకు సం బంధించిన పనులను దాదాపు ఏడాది కాలంలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్నికల హడావిడి ప్రారంభం కానుండటం.. సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలను చుట్టి రావాల్సి ఉండటంతో పనులను వేగిరం చేశారని స్పష్టమవుతోంది. అభివృద్ధి పనులను సంపూర్ణం చేయాలంటే తానే స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఏదైనా తప్పులు జరిగినా ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దవచ్చని అంటున్నారు. అక్టోబర్‌లో దసరా ఉత్సవాల తర్వాత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. నెల తిరగకముందే ఈ నెల 7, 8, 9 తేదీల్లో పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా కోస్గిలో నిర్మించిన సైన్స్ మ్యూజియంను ప్రారంభిస్తారు. ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు పరిశీలన చేయగా.. సెప్టెంబరులో మద్దూరులో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించిన ఆయన పలు సూచనలు చేశారు. మార్చి లోపు భవనం అందుబాటులోకి రావాలని ఆదేశించగా.. ఈ పర్యటనలో ఆ పనులను పరిశీలించనున్నారు. గతంలో భూమి ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సమీక్ష చేసే అవకాశం ఉంది.
ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌పైనా దృష్టి
నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలకు సాగునీరు.. అనేక గ్రామాలకు తాగునీటి కోసం ఉద్దేశించిన ఎంన్‌కేఎల్‌ఐఎ్‌సపై సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించారు. 2014లో జీఓ 69 ద్వారా నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి సాధించినప్పటికీ.. దాన్ని పదేళ్ల పాటు చేపట్టలేదు. దానికి బదులు పాలమూరు- రంగారెడ్డి ద్వారా సాగునీరు ఇస్తామని గత బీఆర్‌ఎస్ రీడిజైన్ చేసింది. అయినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు పూర్తికాకపోవడం, అప్పటి ఎమ్మెల్యే.. ఇప్పుడు సీఎం కావడంతో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి మంజూరు చేసి.. శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 5వేల కోట్ల విలువ చేసే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు శరవేగంగా నడుస్తున్నాయి. రిజర్వాయర్లు, ప్రెషర్ మెయిన్స్, అప్రోచ్ కెనాల్, లిఫ్టులు పూర్తవుతుండగా.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి లిఫ్టులను ప్రారంభించాలని సీఎం గడువు నిర్దేశించారు.
తర్వాత ఎన్నికల హడావిడిలో పనులు వేగంగా జరగవనే ఉద్దేశం కూడా కారణం కావొచ్చు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం అందజేయగా.. ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుం డా చూసుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి శని, ఆది, సోమవారాల్లో నియోజకవర్గంలో పర్యటించనుండగా.. ఎడ్యుకేషనల్ హబ్, డిగ్రీ కాలేజీలు, రోడ్ల విస్తరణ, మౌలిక వసతులతో పాటు ప్రధానంగా ఒక సెషన్ మొత్తం మక్తల్ - నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.
పుట్టిన రోజు వేడుకలు ఇక్కడే..
సాధారణంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎంలు తమ నియోజకవర్గాల్లో తక్కువ పర్యటనలు చేస్తుంటారు.. నియోజకవర్గ నేతలకు, ప్రజలకు ఏవైనా పనులున్నా.. ఒక అధికారి లేదా ఓఎ్‌సడీ లేదా ముఖ్య నాయకుల ద్వారా వినతులు స్వీకరిస్తూ పూర్తిచేస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూడా పూర్తిస్థాయి వ్యవస్థ ఉండటంతో పాటు ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఇన్‌చార్జిగా సేవలు అందిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డి కూడా గత సీఎంలకు భిన్నంగా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే పాలమూరు జిల్లాలో ఆయన ఎక్కువసార్లు పర్యటిస్తుండగా.. నియోజకవర్గాల విషయానికి వస్తే తన నియోజకవర్గానికి ఆ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినప్పటికీ బిజీ షెడ్యూల్‌లో చాలామందిని కలవలేని పరిస్థితి. హైదరాబాద్‌కు వచ్చినా కలవడానికి వీలుకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతీ నెలా నియోజకవర్గంలో పర్యటిస్తు న్న రేవంత్‌రెడ్డి.. సాధ్యమైనంత వరకు ని యోజకవర్గ నాయకులను కలవడం, వారి సమస్యలు తెలుసుకోవడం, రాజకీయ పరిణామాలపై ఆరా తీయడం సాధ్యమవుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ సారి పర్యటన, ఆయన పుట్టిన రోజు ఒకే సమయంలో రావడంతో వేడుకలు నియోజకవర్గంలోనే జరుపుకోనున్నారు. ఏడో తేదీ సాయంత్రం వరకు నియోజకవర్గం చేరుకుని.. పలు సమీక్షలు చేసిన అనంతరం.. 8వ తేదీ మొత్తం వేడుకలు, కార్యకర్తలు, ప్రజలను కలవడం ప్రాధాన్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.