Share News

పాత ప్రతిపాదన.. కొత్త పంచాయితీ

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:29 PM

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించాలని భావిస్తున్న గొల్లపల్లి రిజర్వాయర్‌ చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వకముందే కమీషన్లు, వాటాల వరకు మాటల తూ టాలు పేలుతున్నాయి.

పాత ప్రతిపాదన.. కొత్త పంచాయితీ
రిజర్వాయర్‌ వద్దని గొల్లపల్లిలో ధర్నా చేస్తున్న రైతులు

గొల్లపల్లి రిజర్వాయర్‌ ఏర్పాటుపై కొనసాగుతున్న పొలిటికల్‌ వార్‌

బీఆర్‌ఎస్‌ హయాంలోనే కేఎల్‌ఐ అదనపు రిజర్వాయర్ల కోసం సర్వే

గతంలో ఎంపిక చేసిన 20 రిజర్వాయర్లలో గొల్లపల్లి ఒకటి

ప్రభుత్వ పరిశీలనలోనే ప్రతిపాదన, అయినా కమీషన్లపై ఆరోపణ

తూము ఏర్పాటు చేశాం కాబట్టి అవసరం లేదని బీఆర్‌ఎస్‌ వాదన

9న గొల్లపల్లిలో ధర్నా చేపట్టనున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించాలని భావిస్తున్న గొల్లపల్లి రిజర్వాయర్‌ చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వకముందే కమీషన్లు, వాటాల వరకు మాటల తూ టాలు పేలుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలనే తాము ఆమోదించి ప్రతిపాదిస్తున్నామని, గతంలో చేయాలనిపించి.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్‌ఎ్‌సకు వద్దనిపిస్తోందని, డిజైన్‌, రీడిజైన్‌ వారు చెబితేనే చేయాలన్నట్లుగా ఉందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్‌కు 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు తూము పెట్టామని, కాబట్టి గొల్లపల్లి రిజర్వాయర్‌ అవసరం లేదని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఇప్పటికే అక్కడ టెంట్లు వేసి ధర్నాలు చేస్తుండగా.. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధర్నాలో పాల్గొననున్నారు. ఈ రిజర్వాయర్‌ను సాధ్యమైనంతగా రాజకీయంగా వాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుండగా, మేము చెప్పేది ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. అయితే ఈ రిజర్వాయర్‌ ప్రతిపాదన మాత్రం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నది ముమ్మాటికీ కాదని అధికారిక వివరాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. గత ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టి వదిలేస్తే, అవే ప్రతిపాదనలను తిరిగి చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఏదుల వద్ద తూము పెట్టడం వల్ల గతంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతిపాదించిన గొల్లపల్లి రిజర్వాయర్‌ కట్టొద్దని ఆ పార్టీ డిమాండ్‌గా ఉంది. అధికారికంగా వనపర్తి జిల్లాకు పీఆర్‌ఎల్‌ఐలో ఈ తూము ద్వారా వచ్చే ఆయకట్టును మాత్రం ఇప్పటివరకు పొందుపర్చలేదని కాంగ్రెస్‌ చెబుతోంది.

20 రిజర్వాయర్లలో ఒకటి..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగూడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం సామర్థ్యం 4 టీఎంసీలు మాత్రమే. ఈ పథకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు 25 టీఎంసీల వరద జలాలు కేటాయింపులు ఉండగా, నీటి ఎత్తిపోతల రోజులు 90 ఉండేవి. బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు కేటాయింపులు పెంచి, ఎత్తిపోతల రోజులను 120కి పెంచారు. ఆయకట్టును 3.40 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచుతూ జీవోఆర్‌టీ నెంబర్‌ 941ను 21 అక్టోబరు 2016లో జారీ చేశారు. నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటంతో కేటాయించిన నీటిలో వరద రోజులు మినహా 4 టీఎంసీలే వాడుకోవడానికి అవకాశం ఉంది. దీంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్‌వీ కన్సల్టెన్సీకి ప్రధాన కాలువ వెంట ఆన్‌లైన్‌ రిజర్వాయర్ల ఏర్పాటు అనుకూలతలపై సర్వేకు ఆదేశించింది. 53 ఆన్‌లైన్‌ రిజర్వాయర్లు అనుకోగా.. 47 రిజర్వాయర్ల ఏర్పాటుపై ఏజెన్సీ సర్వే పూర్తిచేసింది. మిగిలిన ఆరుచోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. 3 మార్చి 2019 రోజన అప్పటి సీఎం కేసీఆర్‌ సమీక్ష సందర్భంగా 47 రిజర్వాయర్ల డీపీఆర్‌ ముందుంచడంతో ఎక్కువ భూమి నష్టపోకుండా, నీటి నిల్వ ఎక్కువగా ఉండేట్లుగా రిజర్వాయర్లు ఉండాలని సూచించారు. ఆయన సూచనలకు అనుగుణగా 47లో కేవలం 20 రిజర్వాయర్లను అధికారులు ఎంపిక చేశారు. వీటన్నింటి సామర్థ్యం 9.956 టీఎంసీలుగా ఉంటుందని ప్రతిపాదించారు. 2019-2020 ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రకారం రూ.2,460 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. అలా ఎంపిక చేసిన 20 రిజర్వాయర్లలో గొల్లపల్లి కూడా ఒకటి. ఆ తర్వాత కరోనా పరిస్థితులు, అది సద్దుమణిగిపోయేలోగా ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో ప్రతిపాదనలు అక్కడే నిలిచిపోయాయి.

ఇప్పుడెందుకు అభ్యంతరం..

ఏ రిజర్వాయర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా.. వెంటనే రైతులు ఒప్పుకున్న దాఖలాలు రాష్ట్ర చరిత్రలో లేవు. ప్రభుత్వం వారికి పరిహారం సరిపోయేంత ఇచ్చి.. వసతులు కల్పించిన చోట్ల తొందరగా నిర్మాణాలు పూర్తవుతాయి. అలా కానిచోట్ల కేసులు, కోర్టులు అని సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటాయి. అయితే గొల్లపల్లి రిజర్వాయర్‌ ఏర్పాటుకు కూడా కొంతమంది అభ్యంతరం చెబుతున్నారు. అందులో మెజారిటీ బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఉన్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అదే సమయంలో ఒకవేళ ఏర్పాటైతే మంచి పరిహారం ఇవ్వాలని భావిస్తున్నవారు ఉన్నారు. ప్రతిపాదిత రిజర్వాయర్‌ సామర్థ్యం 2.810 టీఎంసీలు కాగా.. 1,352 ఎకరాల భూసేకరణ అవసరం. దీని ద్వారా 42,663 ఎకరాల ఆయకట్టు నీరివ్వొచ్చు. ఇందులో గ్రామాలేవి ముంపునకు గురికావు. కేవలం భూములు మాత్రమే మునుగుతాయి. ఏదుల రిజర్వాయర్‌ నిర్మితమవుతున్నప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలని సర్వే, డీపీఆర్‌ తయారు చేయగా.. అప్పుడు ఏదుల పక్కనే ఉన్నట్లు కనిపించలేదని, ఇప్పుడు పాత ప్రతిపాదనను కొనసాగిస్తుంటే మాత్రం ఏదుల పక్కనే ఉందనే విషయం తెలుస్తుందా? అని బీఆర్‌ఎస్‌ నాయకులను కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయినా రిజర్వాయర్‌ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉండగానే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నారు. బీఆర్‌ఎ్‌సకు అప్పుడు ఏదుల ఉన్నట్లు కనిపించకపోతే తమకూ కనిపించడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఒకవేళ కడితే తాము కట్టాలి.. వేరొకరు కడితే కాళ్లల్లో కట్టెలు పెడతామనే వైఖరి సరికాదని విమర్శిస్తున్నాయి. అయితే గొల్లపల్లి ద్వారా భూముల ముంపు లేకుండా ఉండేందుకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఏదుల వద్ద 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు తూము పెట్టించారని, అది ఉన్నప్పుడు ప్రజాధనం ఎందుకు వృథా చేయడమని బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. 2019లోనే ఆగిన ప్రతిపాదనలను మళ్లీ కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత ఎందుకు మొదలుపెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో కొందరు ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములను రిజిస్ర్టేషన్‌ అక్రమంగా చేసుకున్నారని, కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత వంద ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వపరం చేసినట్లుగా సమాచారం. దీనికి ఈ పనులను అడ్డుకోవడానికి సంబంధం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రతిపాదిత 20 రిజర్వాయర్లు ఇవే..

బీఆర్‌ఎస్‌ హయాంలో 20 రిజర్వాయర్లను ప్రతిపాదించారు. అవి గొల్లపల్లి, గోపాల్‌పేట, భీమ సముద్రం, యట్మత్పూరు్క్ష ఇంద్రకల్‌, బుద్ధసముద్రం, మాదారం, జూపల్లి, బొల్లంపల్లి, జైరాం తండా, చిన్నమద్దునూరు, గౌతంపల్లి, ఉప్పునుంతల, తాడూరు, ఖిల్లాఘణపురం, భల్లనుపల్లి, అల్లంతోటబావి తండా, పానగల్‌, బుద్ధారం (రీచ్‌ 2) వద్ద నిర్మించాలని నిర్ణయించారు.

Updated Date - Apr 06 , 2026 | 11:29 PM