వరుణ దేవా.. కరుణించు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:23 PM
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వరుణ దేవుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
- తడి కోసం రైతుల తంటాలు
- స్రింక్లర్లతో నీటిని అందిస్తున్న రైతులు
దేవరకద్ర, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వరుణ దేవుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట్లో ఓ మోస్తారు వర్షాలు కురవడంతో దుక్కలు సిద్ధం చేసుకున్న రైతులు జొన్న, పత్తి తదితర మెట్ట పంటలు సాగు చేశారు. విత్తిన విత్తనాలు సక్రమంగా మొలకెత్తక పోవడంతో నీటి సౌకర్యం ఉన్న రైతులు స్ర్పింక్లర్ల ద్వారా తడులు పెడుతున్నారు. ఎలాంటి నీటి వసతులు లేని రైతులు మొలిచిన విత్తనాల వరకు కలుపు తీసి ఉంచారు. వర్షాలు కురిస్తే మొలవని దగ్గర మళ్లీ విత్తనాలు విత్తేందుకు రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ చినుకు రాలకపోవడంతో ఏం చేయాలో ఆర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు. మండలంలో ఇప్పటి వరకు మొత్తం 2250 ఎకరాల్లో మెట్ట పంటలు సాగైనట్లు వ్యవసాధికారుల అంచనా. 1650 ఎరాల్లో పత్తి, 200 ఎకరాల్లో జొన్న, 300 ఎకరాల్లో ఆముదం సాగైంది.
జాడలేని వర్షాలు..
ప్రభుత్వం, వ్యవసాయాధికారులు చెప్పినట్లుగానే ఎల్‌నినో ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటి వరకు వర్షాకాలం మొదట్లో మాత్రమే ఒకటి, రెండు వర్షాలు కురిసినప్పటికీ.. ఆ తర్వాత వరుణుడు కనుమరుగవ్వడంతో వేసవిని తలిపిస్తోంది. మొలకెత్తిన మొక్కలు కూడా ఎండ వేడిమికి ఎండుముఖం పట్టగా బోరుబావులు ఉన్న రైతులు స్ర్పింక్లర్లు పెట్టి నీటి తడులు అందిస్తున్నారు.
పదెకరాల్లో పత్తి సాగు చేశా..
నాకున్న ఐదెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశారు. కానీ వర్షాలు కురువకపోవడంతో సక్రమంగా మొలకలు రాలేదు. ఇప్పటి వరకు విత్తనాలు, దున్నడానికి, గుంట తోలడానికి, కూలికీ దాదాపు రూ.60 వేలు పెట్టుబడి పెట్టిను. ప్రస్తుతం మొలకలు కాపాడుకునేందుకు కలుపు తీస్తున్నాను.
- రాంచంద్రయ్య, రైతు, డోకూర్
వర్షాలు తక్కువే..
ఈ సంవత్సరం ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కుగా ఉంటాయనే విషయాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో రైతులకు వివరించడం జరిగింది. కానీ ఆశతో రైతులు పత్తి, ఆముదం తదితర మెట్ట పంటలు సాగు చేశారు. దాదాపు 10 వేల ఎకరాల వరకు రైతులు వరినారు మళ్లు పోసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
- రాజేంద్ర అగర్వాల్, ఏవో