అటవీశాఖ అడ్డంకి
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:31 PM
నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుండగా, అటవీశాఖ అడ్డంకులతో పర్యాటక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనే చెప్పవచ్చు.
- నిలిచిపోయిన పర్యాటక అభివృద్ధి పనులు
- ఏడాది క్రితం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి
- బ్రహ్మగిరి కృష్ణానది ఒడ్డున నిర్మాణం కోసం రూ. 16 కోట్ల నిధులు
- అనుమతి పత్రం ఉంటేనే నిర్మాణం చేపట్టాలంటున్న అటవీశాఖ
బ్రహ్మగిరి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుండగా, అటవీశాఖ అడ్డంకులతో పర్యాటక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనే చెప్పవచ్చు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి, కృష్ణగిరి గ్రామాలతో పాటు శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలో తెలంగాణ వైపున పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసిన అటవీశాఖ ఉన్నతాధికారుల అనుమతులు లేవని పనులను చేపట్టకుండా నిలిపివేశారు. కాగా, శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం డ్యామ్‌కు ఎడమ వైపున ఉన్న ఈగలపెంట, బ్రహ్మగిరి, ఎడమ పాతాళగంగ పరిసర ప్రాంతాల పరిధిలో 890 ఎకరాల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు బదలాయించారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా నీటి పారుదాలశాఖ ఆధీనంలో ఉన్నది. 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి స్వదేశీదర్శన్ పథకంలో భాగంగా బ్రహ్మగిరి పంచాయతీ పరిధిలో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు అప్పట్లో నీటిపారుదలశాఖ అనుమతి (ఎన్‌ఓసీ) ఇచ్చి పర్యాటక శాఖకు అప్పజెప్పింది. 2016లోనే అటవీశాఖ అధికారులు కూడా ఎన్‌ఓసీని అందచేసి రూ.20 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు.
- మంత్రి భూమిపూజ చేసినా నిలిచిన పనులు
నల్లమల ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రత్యేక నిధుల కింద ప్రభుత్వం రూ.68.10 కోట్లు కేటాయించగా, బ్రహ్మగిరికి రూ.19.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాగా, గత సంవత్సరం ఆగస్టులో కృష్ణానది ఒడ్డున పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఇతర ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు చేపడుతుండగా, అటవీ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి నిర్మాణ పనుల కోసం నిధులు ఖర్చు చేయకపోతే రూ.19.50 కోట్లు వెనుతిరుగుతాయని పర్యాటక శాఖ అఽధికారులు పేర్కొంటున్నారు.
నిర్మాణం చేయాల్సిన పనులు
బ్రహ్మగిరిలో అక్కమహాదేవి గుహల సందర్శన కోసం వచ్చే పర్యాటకులు శ్రీశైలం వెళ్లే పర్యాటకులు విడిది కోసం నిర్మాణం చేపట్టేందుకు మంజూరైన పనులు ఇలా ఉన్నాయి. డ్యామ్ సమీపంలో పర్యాటక ముఖద్వారం ఈగలపెంట, మృగవాణి, అతిథి గృహం దగ్గర చెంచులక్ష్మి కళా మ్యూజియం, హస్తకళ ప్రదర్శన కేంద్రం టికెట్ కౌంటర్, మత్స్యకారుల కాలనీ దగ్గర పర్యాటకుల కోసం విశ్రాంతి గది, క్యాంటిన్, డ్రెవర్ షల్టర్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వాహనాల పార్కింగ్, సమాచార కేంద్రం తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నది.
ఇబ్బందులు సృష్టిస్తున్న అటవీశాఖ
- సరిత, తెలంగాణ టూరిజం ఎస్‌ఈ
బ్రహ్మగిరిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు పదేళ్ల క్రితం అనుమతులు పొందినప్పటికీ అటవీశాఖ అధికారులు మరోమారు అనుమతి పొందితేనే నిర్మాణం చేపట్టాలి. ఆ శాఖ అఽఽధికారులు ఇబ్బందులకు గురి చేయడం వల్ల కాంట్రాక్టర్ పనులు వదిలే పరిస్థితి ఏర్పడింది.