కంది రైతుకు కన్నీళ్లే
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:26 PM
కంది రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం కారణంగా పూతలేదు.. కాతలేదు.
- వర్షాభావంతో పూతలేదు.. కాతలేదు
గండీడ్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కంది రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం కారణంగా పూతలేదు.. కాతలేదు. మరికొన్ని ఎండిపోయి రైతుకు తీవ్ర దుఖాన్ని మిగిల్చాయి. దీంతో ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతకు నిరాశే మిగిలింది. దాదాపు రెండు నెలలుగా ఒక్క వర్షం కూడా పడలేదంటే పరిస్థితి ఇట్టే అర్థమంఉతోంది. గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో దాదాపు 3వేల ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేయగా, పెట్టుబడి మీదపడి అప్పుల పాలవుతున్నామన్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో తేమ తగ్గి మొక్కలు ఎండిపోయాయి. మరి కొందరు రైతుల పంట వాడు పట్టి పూత రాలిపోయి కట్టేలే మిగులుతున్నాయి. ప్రభుత్వం పంట నష్టాన్ని గుర్తించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎండిన పంటల వివరాలు సేకరిస్తున్నాం..
ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలతో మండలంలో కంది పంటతో పాటు ఎండిన వరి పంటను కూడా ఏఈవోలతో సర్వేచేసి వివరాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాం.
- నరేందర్, ఏవో, మహమ్మదాబాద్