స్పందించడం లేదు....!
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:41 PM
ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదటి నుంచి తీవ్ర గందరగోళంగా జరుగుతోంది.
- ఎస్‌ఐఆర్ నోటీసులపై విచారణకు హాజరుకాని ఓటర్లు
- అవగాహన లోపంతో గడువు ముగిసిపోతున్న పరిస్థితి
- ఉమ్మడి పాలమూరులో 2.78లక్షల నోటీసుల గడువు పూర్తి
- అత్యధికంగా మహబూబ్‌నగర్, తర్వాత స్థానంలో గద్వాల
- రీ షెడ్యూల్ చేయడం అంతంతే.. ఓటుహక్కుపై నీలినీడ
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదటి నుంచి తీవ్ర గందరగోళంగా జరుగుతోంది. ఓటర్లకు కనీస అవగాహన కల్పించకపోవడం దగ్గర నుంచి ఏఐ జనరేటెడ్ నోటీసుల వరకు పారదర్శకత, జవాబుదారీతనం లోపిం చింది. బీఎల్‌వోలపై అధిక లోడ్ పడటంతో పలుచోట్ల వారు చనిపోతున్న ఘటనలూ జరుగుతున్నాయి. సిబ్బంది సరిపోకపోవడం, లక్షల సంఖ్యలో నోటీసులు ఉండటంతో విచారణ తేదీ రోజూ ఓటర్లు హాజరు కాలేకపోతున్నారు. కొందరు ఓటర్లు వివిధ ప్రాంతాల్లో స్థిరపడటం, కేవలం నోటీసు కోసం రాలేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్‌ఐఆర్ ప్ర క్రియలో అధికారులు యంత్రాల మాదిరి పని చేస్తున్నారే తప్పా.. అవగాహన లేనివారికి మాత్రం వివరాలు అందించడం లేదు. ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 6,63,310 మంది ఓటర్లకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జనరేట్ కావడం గమన ార్హం. ఇవి కాకుండా గత ఓటర్ల జాబితాలో నుంచి మరణించిన, పూర్తిగా షిప్ట్ అయిన, డబుల్ ఓటర్లు తొలగిపోగా.. కేవలం వివరాల్లో తేడాలు ఉండి నోటీ సులు జారీ చేసిందే ఇంత మొత్తంలో ఉండటం వ్యవస్థ లోపాలకు అద్దం పడుతోంది. హరీబరీగా బీఎల్‌వోలతో ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం, ఒకే చోట కూర్చుని వాటిని నింపడం, వారికీ సరైన అవగాహన లేక తప్పులు చేయడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా దశాబ్దాల క్రితం చని పోయిన తల్లిదండ్రులకు సంబంధించిన వయసు తేడాలకు ఇప్పుడు వివరణ నోటీసు జారీ కావడం చూస్తే ప్రక్రియ జఠిలత్వాన్ని తెలియజేస్తోంది. వారంతా చిన్నచిన్న తప్పులకు వివరణ ఇచ్చుకోలేక మిన్నకుండిపోతున్నారు.
2.78 లక్షల నోటీసుల గడువు పూర్తి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 6,63,310 మంది ఓటర్లకు వారు ఇచ్చిన ఎన్యుమరేషన్ పత్రాల్లో తేడాలు ఉండి.. ఎనామలిస్ జాబితాలోకి చేర్చడంతో వారందరికీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వారికి వివిధ తేదీలు ఇచ్చి విచారణ అధికారి వద్దకు హాజరు కావాలని సూచించగా.. ఇప్పటివరకు చాలా తక్కువ సంఖ్యలోనే హాజరవుతున్నారు. నోటీసులు సరిగా అందకపోవడం, ఊర్లలో ఉండేవారికి అవగాహన లేకపోవడం, పట్టణాల్లో ఉన్నవారికి పట్టింపు లేక పోవడంతో అందులో 2,78,550 (41ు) మంది గడువు ముగిసినా విచారణకు హాజరుకాలేదు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో సమస్య తీవ్రంగా ఉండగా.. కనీసం అధికారులు అవగాహన కల్పించడం లేదు.
2,04,335 మందికి నోటీసుల జారీ..
మహబూబ్‌నగర్ జిల్లాలో 2,36,590 మందికి నోటీసులు జనరేట్ కాగా.. 2,04,335 మందికి మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి. అందులోనూ 1,26,633 మంది ఓటర్ల విచారణ గడువు ముగిసింది. వీరు అసలు విచారణకు హాజరు కాలేదు. ఇందులో రీషెడ్యూల్ కేవలం 42 మంది చేసుకోగా.. మిగతా వారు అసలు స్పందించడం లేదు. ఇదే విధానం కొనసాగితే వారి ఓటర్లను తొలగిస్తారా? అనే ఆందోళన కూడా ఉంది. ఆ తర్వాత స్థానంలో 1.49 లక్షల నోటీసులు జోగులాంబ గద్వాల జిల్లాలో జనరేట్ కాగా.. 1.46 లక్షల నోటీసులు అందజేశారు. అందులో 93,476 మంది ఓటర్లది నోటీసుల గడువు ముగియగా.. 37 మంది మాత్రమే రీ షెడ్యూల్ చేసుకున్నారు.
ఆ రెండు జిల్లాల్లోనే..
ఓటర్ జాబితాలో తప్పుల విషయంలో మహబూబ్ నగర్, గద్వాల జిల్లాలు ముందంజలో ఉన్నాయని నోటీసుల జనరేషన్ చూస్తే అర్థమవుతోంది. వాస్తవానికి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికే ఎనా మలిస్ జాబితాను ప్రకటించగా.. అందులో వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎక్కువ సంఖ్య చూపించింది. కానీ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయ్యేనాటికి మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో ఎక్కువ నోటీసులు జనరేట్ అయ్యాయి. అలాగే విచారణ తేదీలకు ఎక్కువ మంది డుమ్మా కొట్టడం కూడా ఇక్కడే కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 41 శాతం నోటీసుల విచారణ గడువు ముగియగా.. అందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 61 శాతం (1,26,633) మంది విచారణకు హాజరరు కాలేదు. గద్వాలలలో జనరేట్ అయిన నోటీసులలో 63.60 శాతం నోటీసుల విచారణ గడువు ముగిసింది. నారాయణపేట జిల్లాలో 36.70 శాతం (20,893), వనపర్తి జిల్లాలో 19.34 శాతం (15,148), నాగర్‌కర్నూలు జిల్లాలో 19.05 శాతం (22,070) నోటీసుల విచారణ గడువు ముగిసింది. దీన్నిబట్టి చూస్తే ఉమ్మడి పాలమూరులోని ఏ జిల్లాలో బీఎల్‌ఓల స్థాయి నుంచి ఈఆర్‌వో/ఏఈఆర్‌వో వరకు ఎంతశాతం అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ నోటీసులు జనరేట్ కావడం గత తప్పిదాలను తెలియజేస్తుంటే.. ఎక్కువ మంది విచారణకు హాజరు కాలేకపోవడం అధికారులు అవగాహన కల్పించడంలోని వైఫల్యాన్ని స్పష్టపరుస్తోంది. అయితే ఇంకా సమయం ఉన్నందున రీషెడ్యూల్ చేసి.. విచారణ చేయాలనే డిమాండ్ వస్తోంది.