ఆగని వందేభారత్
ABN , Publish Date - May 12 , 2026 | 11:28 PM
తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా మారబోతున్న గద్వాల స్టేషన్‌లో వందేభారత్ రైలు ఆగకపోవడం ప్రయాణికులకు నిరాశను మిగులుస్తోంది.
- గద్వాల జంక్షన్ ప్రయాణికులకు తప్పని నిరాశ
- మంత్రికి విన్నవించినా దక్కని ఫలితం
- ఏడాదిగా తప్పని ఎదురుచూపులు
గద్వాల అర్బన్, మే 12 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా మారబోతున్న గద్వాల స్టేషన్‌లో వందేభారత్ రైలు ఆగకపోవడం ప్రయాణికులకు నిరాశను మిగులుస్తోంది. ఏడాదిన్నర క్రితం కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు ప్రారంభమైన వందేభారత్ రైలుకు గద్వాల స్టేషన్‌లో హాల్ట్ ఉంటుందని అందరూ ఆశించారు. కానీ వారి ఆశ నిరాశగా మారింది. కాచిగూడ నుంచి బయలుదేరే ఈ రైలుకు రాష్ట్రంలో ఒక్క మహబూబ్‌నగర్‌లో తప్ప మరో స్టాప్ లేకపోవడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంమైన మహబూబ్‌నగర్‌కు దీటుగా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటమే గాకుండా ఆదాయంలోనూ రికార్డును దక్కించుకున్న గద్వాలలో వందేభారత్ రైలును ఆపకపోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిజాం పరిపాలన కాలంలో మీటర్‌గేజ్‌గా ఉన్న ఈ మార్గం 1996 నాటికి అప్పటి ప్రధాని పీవీ చొరవతో కాచిగూడ నుంచి డోన్ జంక్షన్ వరకు బ్రాడ్ గేజ్‌గా మారింది. 2014లో గద్వాల - రాయచూర్ మార్గం ఏర్పాటుతో జంక్షన్‌గా ఏర్పడింది. ఇటీవలే రైల్వే శాఖ గద్వాల నుంచి డోర్నకల్ వరకు నూతన మార్గం ఏర్పాటు కోం డీపీఆర్ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో తూర్పు, పడమరలను కలిపే అతిపెద్ద జంక్షన్‌గా రూపాంతరం చెందే అవకాశం గద్వాల స్టేషన్‌కు దక్కనుంది. ఈ క్రమంలో వందేభారత్ రైలును తప్పని సరిగా ఇక్కడ హాల్ట్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బెంగళూరుకు వెళ్లే గద్వాల ప్రాంత వాసులు ముందుగా కర్నూలు వరకు వెళ్లి అక్కడి నుంచి వందేభారత్ రైలు ఎక్కాల్సి వస్తోంది. అలాగే గద్వాల మీదుగా వెళ్లే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపాలని స్థానికులతో పాటు సమీపంలోని కర్ణాటక సరిహద్దు రాయచూర్ వైపు వెళ్లే ప్రయాణికులు సైతం డిమాండ్ చేస్తున్నారు.
గద్వాలలో ఆగని ప్రధాన రైళ్లు
ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణించే గద్వాల రైల్వేస్టేషన్ అమృత్ భారత్ పథకం ద్వారా పూర్తిస్థాయి సౌకర్యాలను దక్కించుకుంది. దీంతో ఈ స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలన్నది ఇక్కడి ప్రయాణికుల డిమాండ్‌గా ఉంది. ఈ మార్గంలో వెళ్లే ఐదు ప్రధాన రైళ్లు ఇక్కడ ఆగకపోవడం వారిని నిరాశను పరుస్తోంది. గద్వాల - రాయచూర్ మార్గం 2012లో ప్రారంభమెనా ఇప్పటివరకు ఆ మార్గం కేవలం ఒక ట్రిప్పు తిరిగే డెమో రైలుకే పరిమితమైంది. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబయి, ఉమ్మడి రాష్ట్రానికి వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన విజయవాడలను కలపడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన గద్వాల - రాయచూర్ మార్గాన్ని అనుకున్న స్థాయిలో వినియోగించుకోవడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్వాల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే కొంగు ఎక్స్‌ప్రెస్ (కోయంబత్తూర్ - న్యూఢిల్లీ), గొరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (యశ్వంత్‌పూర్ - గొరఖ్‌పూర్), వేణుగంగ ఎక్స్‌ప్రెస్ (యశ్వంతపూర్ - కోర్బా), కోకా ఎక్స్‌ప్రెస్ (కోకా - రామేశ్వరం - ద్వారక), కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (యశ్వంత్‌పూర్ - న్యూఢిల్లీ) ఉన్నాయి. యశ్వంత్‌కూర్ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్లే రైలులో (కాశీ) వారాణసికి వెళ్లే సౌకర్యం ఉన్నా, గద్వాలలో హాల్ట్ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కాగా, వందేభారత్ రైలు హాల్ట్ కోసం ఏడాది క్రితం మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు డీకే అరుణ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లిఖిత పూర్వకంగా విన్నవించినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాకపోవడం ప్రయాణికులకు నిరాశను మిగిల్చింది.
ఆపితే అందరికీ ఉపయోగం
గద్వాల మీదుగా వారానికి ఆరు రోజులు తిరిగే వందేభారత్ రైలును జంక్షన్‌లో హాల్ట్ చేయాలి. నడిగడ్డ ప్రాంతం నుంచి బెంగళూరుకు వెళ్లేవారు, అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడిన అనేక కుటుంబాలతో ఇక్కడి వారితో బంధుత్వాలు, వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రైలును ఇక్కడ ఆపడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా జరీ చీరల వ్యాపారులకు రవాణా వెసులుబాటు లభిస్తుంది.
- ఎస్‌వీ రమణ, ఉపాధ్యాయుడు, గద్వాల