Share News

నో స్టాక్‌...!

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:25 PM

మొన్నటివరకు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఇరాన్‌- ఇజ్రాయిల్‌- అమెరికా యుద్ధం దాదాపుగా ముగిసింది.

నో స్టాక్‌...!
నవాబుపేట మండలంలో పెట్రోల్‌ కోసం ద్విచక్ర వాహనదారుల బారులు

- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో ఇవే బోర్డులు

- కొన్నిచోట్ల లభ్యమైనా.. భారీగా వినియోగదారుల లైన్లు

- దొరకదేమోనని అవసరానికి మించి కొనుగోలు

- జాతీయ రహదారి వెంట నిలిచిపోతున్న వాహనాలు

- సరిహద్దులో ఏపీ వినియోగదారుల రాకతో బంక్‌లు ఖాళీ

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మొన్నటివరకు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఇరాన్‌- ఇజ్రాయిల్‌- అమెరికా యుద్ధం దాదాపుగా ముగిసింది. ఇక కొరత లేకుండా సరఫరా కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉన్నచోట్ల మరింత కొరత ఏర్పడక ముందే నిల్వ చేసుకోవాలని ప్రజలు ప్యానిక్‌ బయ్యింగ్‌ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం పెట్రోల్‌, డీజిల్‌ బంకులను ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ నిర్వహించింది. దాదాపు 75 శాతం బంకుల్లో నో స్టాక్‌ బోర్డులే కనిపించగా.. మిగతా చోట్ల పెట్రోల్‌ ఉంటే డీజిల్‌ లేకపోవడం.. డీజిల్‌ ఉంటే పెట్రోల్‌ లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయి. రెండూ ఉన్నచోట్ల అడిగినంత కాకుండా ఒక్కో మనిషికి ఇంత అని సీలింగ్‌ పెట్టి.. కొరతను బ్యాలెన్స్‌ చేయడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌ నిల్వ చేసుకోవడానికి చాలామంది పెద్దపెద్ద క్యాన్లు తీసుకెళ్లి నింపుకుంటున్నారు. వారు ఆయా గ్రామాల్లో రూ. 20 నుంచి రూ. 30 వరకు అధిక ధరకు విక్రయించడం పలుచోట్ల కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాను చీల్చుకుంటూ వెళ్లే జాతీయ రహదారి 44పై ఇంధనం లేక భారీ వాహనాల నుంచి కార్ల వరకు అన్నీ నిలిచిపోతున్నాయి. ప్రధాన సరుకు రవాణా అంతా దేశంలో రోడ్డు మార్గం గుండానే సాగుతుండటంతో ఈ ఇంధన కొరత ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నిచోట్ల దాదాపు నాలుగు రోజుల నుంచి నో స్టాక్‌ బోర్డులే దర్శనిమిస్తుండటం గమనార్హం. అధికారులు మాత్రం కొరత లేదని, ప్యానిక్‌ బయ్యింగ్‌ వద్దని చెబుతుండగా.. కొరత లేకపోతే బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు ఎందుకు పెడుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సరిహద్దుల్లో శనివారమే ఖాళీ

ఉమ్మడి జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సెగ మొదట ఏపీ సరిహద్దులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాపై పడింది. మొదట ఏపీలో కొరత ఏర్పడటంతో కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి భారీగా వాహనాదారులు క్యాన్లు, డ్రమ్ములు తీసుకువచ్చి.. అలంపూర్‌చౌరస్తా, ఉండవల్లి, అలంపూర్‌, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల పరిధిలోని బంకులపై ఎగబడ్డారు. దీంతో సరిహద్దుల్లోని బంకుల్లో శనివారం నాటికే నో స్టాక్‌ బోర్డులు పెట్టేశారు. అడపాదడపా లోడ్లు వస్తున్నా.. ఒకరి నుంచి ఒకరికి స్టాక్‌ సమాచారం పాకుతుండటంతో అధికంగా కర్నూలు ప్రాంతంవారే కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వరికోతల సీజన్‌ కావడంతో హార్వెస్టర్‌, ట్రాక్టర్లకు డీజిల్‌ ఎక్కువగా అవసరం.. కానీ ఎక్కడా దొరక్కపోవడంతో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు క్యాన్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఇక జాతీయ రహదారిపై 90శాతం పెట్రోల్‌ బంకులు సోమవారం నో స్టాక్‌ బోర్డులతోనే కనిపించాయి. కొరత ఉండటంతో వాహనాలను నిలిపివేస్తున్నారు. ఒక్క భూత్పూరు వద్ద ఉన్న భారత్‌ పెట్రోల్‌ పంపులోనే ఇంధనం లేకపోవడంతో అయిదు వాహనాలను నిలిపివేశారు. అటు శ్రీశైలం హైవేలో మాత్రం పెట్రోల్‌ అందుబాటులో ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సరుకు రవాణా తగ్గి.. నిత్యావసరాల ధరలు భగ్గుమనే ప్రమాదం ఉంది. అక్కడక్కడా పెట్రోల్‌ దొరకుతున్నప్పటికీ డీజిల్‌ కొరత తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. నారాయణపేట మహిళా సమాఖ్య బంకులో రోజుకు 10వేల లీటర్ల డిజీల్‌ విక్రయం జరిగేది. కానీ ప్రస్తుతం అందుబాటులో లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో అయిదు బంకులు ఉంటే అన్ని మూసివేశారు. నో స్టాక్‌ బోర్డులతోపాటు వాహనాలు రాకుండా తాళ్లు కట్టారు. పెబ్బేరు పట్ణణంలో కొరత ఎఫెక్ట్‌తో కొన్ని బంకులు మూత ఉండగా.. ఇంధనం ఉన్న బంకుల్లో పోలీసుల పహారాలో విక్రయాలు జరిపారు. నవాబుపేట మండలంలో పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనిమిచ్చాయి. పెద్దకొత్తపల్లి మండలంలో మూడు బంకులు ఉండగా.. ఒక బంకు మూతపడింది. చిన్నంబావిలో ఒక బంకు, మానవపాడు మండలంలో మూడు బంకులు, కోయిల్‌కొండలో ఒక బంకు మూత ఉండగా.. మరో బంకులో డీజిల్‌ లేదు. ఎర్రవల్లి మండలంలో రెండు పంపుల్లో నో స్టాక్‌ బోర్డు పెట్టారు. బెటాలియన్‌ పంపులో మినిమం ఫ్యూయల్‌ అందిస్తున్నారు. కొల్లాపూర్‌ పట్టణంలో ఇండియన్‌, హెచ్‌పీ, భారత్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డు తగిలించారు. ప్రైవేటు కిరాణా దుకాణాల్లో పెట్రోల్‌పై రూ. 20 అదనంగా చెల్లిస్తే విక్రయిస్తున్నారు. గోపాల్‌పేట మండలంలో రెండు పెట్రోల్‌ బంకులు రెండు రోజులుగా మూతపడి ఉన్నాయి. స్టాక్‌ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. అమరచింతలో మూడు బంకుల్లో నిల్వలు లేవు.. రెండు రోజుల క్రితం గద్వాల, మక్తల్‌, మరికల్‌, ఆత్మకూరుల నుంచి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లడంతో ఈ బంకులు మూతపడ్డాయి. మిడ్జిల్‌ మండలంలో మూడు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం లేదు.. అయితే రెండింటికి స్టాక్‌ రావడంతో వేగంగా నిల్వలు ఖాళీ చేశారు. అలంపూర్‌లో మూడు పంపులు మూడు రోజులుగా మూతపడి ఉన్నాయి. ఉర్కొండలో నాలుగు రోజుల నుంచి హెచ్‌పీ బంకు మూతపడింది. గద్వాల జిల్లాకేంద్రంలో రెండు పంపులు మూతపడ్డాయి. భూత్పూరు మండల పరిధిలో జాతీయ రహదారి వెంట 10 పెట్రోల్‌ పంపులు మూతపడ్డాయి. ఖిల్లాఘణపురంలో మూడు పంపుల్లో పెట్రోల్‌ ఉన్నప్పటికీ డీజిల్‌ లేదు. దేవరకద్రలో రెండు బంకుల్లో డీజిల్‌ లేదని బోర్డు పెట్టారు. హెచ్‌పీ పంపులో డీజిల్‌ లభిస్తుండటంతో వాహనదారులు బారులు తీరారు. క్యాన్లు, డబ్బులతో అన్ని బంకుల చుట్టూ వినియోగదారులు తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో చాలాచోట్ల నో స్టాక్‌ బోర్డులే ఉన్నాయి. జైలు శాఖ బంకుల్లో మాత్రమే పెట్రోల్‌ పోస్తున్నారు. ఇక ఎక్కడా స్టాక్‌ లేదు. వెల్దండ, వీపనగండ్ల, మదనాపూర్‌ మండలాల్లోనూ ఇంధన నిల్వలు లేవు.

వ్యవసాయ పనులు నిలిచాయి

వారం రోజులుగా మా ఊర్లో కానీ, చుట్టపక్కల ఊర్లలో డీజిల్‌ దొరకడం లేదు. దీంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం సీజన్‌ కావడంతో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎక్కడ డీజిల్‌ ఉందని సమాచారం వస్తే అక్కకికి వెళ్తున్నాం.. రెండు డబ్బాలతో వెళ్తున్నప్పటికీ మేము వెళ్లేసరికి బంకులు ఖాళీ అవుతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. ఈ ఎండల్లో ఇంధనం కోసం తిరగలేకపోతున్నాం.

- వెంకట శివుడు, మల్యాల, నంద్యాల జిల్లా

డీజిల్‌ లేక డీసీఎం నిలిపివేశా

ప్రస్తుతం అన్ని బంకుల్లో డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. జాతీయ రహదారి వెంట అక్కడక్కడ పెట్రోల్‌ దొరికినా డీజిల్‌ మాత్రం అసలే దొరకడం లేదు. అడపాదడపా లోడ్‌ వచ్చినా తొందరగా ఖాళీ అవుతోంది. నేను హైదరాబాద్‌ నుంచి పులివెందులకు డీసీఎంతో వెళ్తున్నాను. డీజిల్‌ ఎక్కడా దొరక్కపోవడంతో వాహనాన్ని భూత్పూర్‌ భారత్‌ పెట్రోల్‌ బంకులో ఆదివారం నిలిపివేశాను. నాతోపాటు మరో అయిదు లారీలు నిలిచిపోయాయి.

- ఖాజా మియా, డ్రైవర్‌

ఎర్రవల్లిలోనే కారు పెట్టాను

హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు వెళ్తున్నాను. జాతీయ రహదారి వెంట అన్ని పంపుల్లో డీజిల్‌ కోసం అడిగాను.. చాలాచోట్ల పంపులు బంద్‌ ఉన్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్‌ మాత్రమే పోస్తున్నారు. దానికి కూడా క్యాన్లు తీసుకువచ్చి నింపుకుంటున్నారు. ఇంధనం లేక కర్నూలు వరకు కారు తీసుకుని వెళ్లడం ఎందుకని ఎర్రవల్లిలో నా మిత్రుడి ఇంటి వద్ద కారు ఉంచి.. బస్సులో వెళ్లిపోతాను. కొరత తీరిన తర్వాత వచ్చి కారు తీసుకెళ్తాను.

- ఇసాక్‌, ప్రయాణికుడు, కర్నూలు

ఆటోలో వెళ్లి పెట్రోల్‌ తెచ్చుకున్నా

మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. జాతీయ రహదారిపై పెట్రోల్‌ లేకపోవడంతో మా కారు ఆగిపోయింది. జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో వెళ్లి పెట్రోల్‌ కోసం చూశాం.. కానీ ఉన్నచోట్ల భారీలైన్లు ఉండటం.. చాలా చోట్ల నో స్టాక్‌ బోర్డులు ఉండటంతో వెంటనే ఆటోలో జడ్చర్లకు వెళ్లి బాటిళ్లలో పెట్రోల్‌ తెచ్చుకున్నాను. అంతటా పెట్రోల్‌, డీజిల్‌ కొరత చాలా తీవ్రంగా ఉంది.

- చెన్నకేశవులు, మహబూబ్‌నగర్‌

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు : కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై సమీక్షించారు. రెండు వారాల నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా, నిల్వలపై సమీక్షించి, ప్రతీ రోజు నివేదిక సమర్పించాలని అన్నారు. రెండు వారాల్లో కొంత సరఫరా పెరిగిందని ఆయిల్‌ కంపెనీల సేల్స్‌ అధికారులు వివరించారు. వినియోదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ కంపెనీల సేల్స్‌ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. కృతిమ కొరత సృష్టిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, డీఎస్‌వో గంపా శ్రీనివాస్‌, డీఎం రవినాయక్‌, హెచ్‌పీసీఎల్‌ సేల్స్‌ ఆఫీసర్‌ హర్షవర్ధన్‌, ఐఓసీఎల్‌ సేల్స్‌ ఆఫీసర్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:25 PM