తాగునీటికి ఢోకా లేనట్లే..!
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:57 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది సగ టు కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది.
- పాలమూరు - రంగారెడ్డి నుంచి మిషన్ భగీరథకు అనుసంధానం
- రెండు మోటార్ల ద్వారా పంపింగ్ ప్రారంభించిన మంత్రి జూపల్లి
- అంజనగిరి నుంచి ఎల్లూరు గ్రిడ్‌కు తరలింపునకు ప్రత్యేక వ్యవస్థ
- పీఆర్ఎల్ఐ పూర్తయ్యే వరకు కల్వకుర్తి ద్వారా ఆయకట్టుకు నీరు
- ప్రస్తుతం 2 టీఎంసీల నీటినిల్వ.. మరో నాలుగు టీఎంసీలు లిఫ్ట్
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది సగ టు కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం సీజన్లోనూ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. భూగర్భజలాలు లోలోతుకు పడిపో తుండటంతో బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో మరింత ఇబ్బంది కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వరికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించగా.. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచుతున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే ఎల్లూరు వాటర్ గ్రిడ్ ద్వారా వేసవిలో తాగునీరు అందించడం సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎల్లూరులో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం.. అప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అయితే నీటిని ఎత్తిపోసుకునే అవకాశం లేకపోవడంతో ఆ సందేహాలు కలిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచే ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రారంభించింది. ఎల్లూరు గ్రిడ్‌కు నీటి కొరత లేకుండా పాలమూరు- రంగారెడ్డిలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ అంజనగిరి రిజర్వా యర్‌ను ఎల్లూరు మిషన్ భగీరథ గ్రిడ్‌ను అను సంధానం చేయాలని నిర్ణయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ నుంచి ప్రత్యేక కా లువ తవ్వి.. రూ.140 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు పంపులతో ఎత్తిపోతలను సిద్ధం చేశారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఈ పంపుల ద్వారా ఎల్లూరు రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా ఆవాసాలకు నీరందనుంది. ఇప్పటికే పాల మూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మొదటి పంపింగ్ స్టేషన్లో రెండు పంపులను టెస్ట్‌రన్ చేయగా.. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డిలు ఆ రెండు పంపులను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో పంపు 24 గంటల డిశ్చార్జి ద్వారా 0.25 టీఎంసీల నీరు రిజ ర్వాయర్‌లో చేరనుండగా.. రెండు పంపులు కలిపి రోజుకు 0.5 టీఎంసీల నీటిని రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేయనున్నాయి. ఇప్పటికే నార్లాపూర్ రిజర్వాయర్‌లో 2 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. కనీసం పది రోజుల్లో పూర్తిస్థాయిలో నింపనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకోవడం.. మళ్లీ నీటి నిల్వ తగ్గితే నార్లాపూర్తోపాటు ఎల్లూరులో స్టోర్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మళ్లీ వానాకాలం వరకు ఢోకా లేనట్లేనని అధికారులు చెబుతున్నారు.
19 మునిసిపాలిటీలు, 4 వేల ఆవాసాలు
గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పట్టణాలు, గ్రామాలకు వేర్వేరు నీటి వనరుల నుంచి తాగునీటి అవసరాలు తీరేవి. ప్రధానంగా జూరాల, రామన్‌పాడు, జమ్ములమ్మ రిజర్వాయర్లపై అనేక పథకాలు అధారపడేవి. మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చిన తర్వాత అన్నింటినీ మార్చి.. ఇంటి గ్రేటెడ్ వాటర్ సప్లై వ్యవస్థను రూపొందిం చారు. కొన్ని జూరాల ఆధారంగా నడుస్తుండగా.. ఎక్కువ మునిసిపాలిటీలు, గ్రామాలకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తాగునీరు అందుతోంది. ఇక్కడి నుంచి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ సహా 19 మునిసిపాలిటీలు, 18 నియోజకవర్గాల్లోని 88 మండలాల పరిధిలో ఉన్న 4వేల ఆవాసాలకు తాగునీరు అందుతోంది. శ్రీశైలం ఆధారంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మిషన్ భగీరథ స్కీం పరిధిలో మొత్తం 12 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎల్లూరు, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, గౌరిదేవిపల్లి, ముచ్చర్ల, షాద్‌నగర్, రా ఘవాపూర్, కొడంగల్, జడ్చర్ల, అచ్చంపేట, మన్నెంకొండ) ఉన్నాయి. ప్రతీ నెలా ఈ గ్రిడ్ ద్వారా 0.70టీఎంసీల నీటి సరఫరా అవసరం.. సంవత్సరం పొడవునా లెక్కలు తీ సుకుంటే 8.4 టీఎంసీలను సరఫరా చేస్తారు. ఈ నెలతో కలుపుకున్నా.. మళ్లీ వరదలు వచ్చే సమయానికి దాదాపు మరో పది నెలల పాటు నీరు అందించాల్సి ఉంటుంది. కనీ సం 7.5 టీఎంసీల నీరు అవసరం.. ఇప్పుడు శ్రీశైలంలో నీరు ఉన్నా.. వేసవి వరకు నిల్వలు తగ్గే అవకాశం ఉంది. అప్పటివరకు నిల్వ రిజర్వాయర్ లేకపోతే ఎల్లూరు గ్రిడ్‌కు నీరందే అవకాశం తక్కువగా ఉంటుందని భావించి.. పీఆర్ఎల్ఐలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌ను.. ఎల్లూరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసేందుకు లిఫ్టును నిర్మించారు. ఇప్పుడు 2 టీఎంసీల నీరు నార్లాపూర్‌లో నిల్వ ఉండగా.. మరో నాలుగు టీఎంసీలను నిల్వ చేయనున్నారు. ఇందులో ఉన్న ఆరు టీఎంసీలు, ఎల్లూరు నిల్వతోపాటు.. అవసరాన్ని బట్టి మళ్లీ పంపింగ్ చేసు కునే అవకాశం ఉండటంతో ఇబ్బందులు దూరంకానున్నాయి.
కల్వకుర్తి ఆయకట్టుకు భరోసా..
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఇంకా కాలువల భూసేకరణ కూడా సాధ్యం కావడం లేదు. ఇప్పటివరకు తాగునీటి అవసరాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అను మతులు లేకపోవడం వల్ల రుణాలు అందక.. పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉపయోగంలోకి వచ్చిన కల్వకుర్తికి పాలమూరు- రంగారెడ్డి పంపులను, రిజర్వాయర్లను అనుసంధానం చేయడం వల్ల అటు తాగు నీటి అవసరాలు తీరడంతో పాటు కష్ట సమయంలో కల్వకుర్తి ఆయకట్టుకు నీరందించవచ్చు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మొదట్లో 25 టీఎంసీల కేటాయింపులు ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని 40 టీఎంసీలకు పెంచింది. కానీ మొదట నిర్దేశించిన మొత్తం కూడా లిఫ్ట్ చేసుకోలేని పరిస్థితి. అందుకు ప్రధాన కారణం నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడమేనని చెప్పవచ్చు. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగూడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల సామర్థ్యం మొత్తం 4 టీఎంసీలు మాత్రమే.. గతంలో ఆన్లైన్ రిజర్వాయర్లు చేపట్టాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ బుద్ధారం పెద్ద చెరువు, గణపసముద్రం మినహా మిగతా వేవి పట్టాలెక్కలేదు. గొల్లపల్లి కూడా చే పట్టాలని భావించగా.. అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. దీంతో ఆయకట్టు ఉన్నా.. ఒకే పంటకు నీరివ్వడానికి సాధ్యమవుతుంది.. శ్రీశైలానికి వరద తక్కువ వచ్చినప్పుడు ఒక్క పంటకు కూడా నీరివ్వడం కష్టంగా ఉంది. ఇప్పుడు పాలమూరు- రంగారెడ్డిలో నార్లాపూర్ రిజర్వాయర్‌కు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు రిజర్వాయర్‌కు అను సంధానం చేయడం ద్వారా పీఆర్ఎల్ఐ పూర్తయ్యే వరకు కల్వకుర్తి ఆయకట్టుకు కూడా నీరందించవచ్చు. 6 టీఎంసీలతో స్టోరేజీ రిజర్వాయర్‌గా నార్లాపూర్ ఉపయోగపడనుంది.