Share News

శోభాయమానం.. నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:19 PM

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా గణనాథుడు ఆశీర్వదించాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.

శోభాయమానం.. నవరాత్రి ఉత్సవాలు
మోనప్పగుట్టలో గణపతి విగ్రహం వద్ద ఎంపీ డీకే అరుణ పూజలు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా గణనాథుడు ఆశీర్వదించాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం పీయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహానికి పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేశ్‌ భవన్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, అధ్యాపకులు డాక్టర్‌ వేణు, డాక్టర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఫ మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : లక్ష్మీనగర్‌ కాలనీలో ప్లాస్టిక్‌ నివారణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆదివారం కాలనీ వాసి సొన్నతి వెంకటేశ్వర్లు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉత్సవ కమిటీకి 100 స్టీల్‌ ప్లేట్లు, 30 స్టీల్‌ గ్లాసులు, 2 స్టీల్‌ జగ్గులు అందించారు. శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేశారు. అంభభవాని ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం వద్ద భక్తులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వన్‌టౌన్‌, రాంమందిర్‌ చౌరస్తా, కాశీకాపుడి, పాన్‌చౌరస్తా, గడియారం చౌరస్తా, బండమీదిపల్లి, అప్పన్నపల్లి, ఏనుగొండ, రాజేంద్రనగర్‌, ఎర్రసత్యం చౌరస్తా, బ్రాహ్మణవాడి తదితర ప్రాంతాల్లో ఘనంగా పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పూజలు

జడ్చర్ల : పట్టణంలోని కావేరమ్మపేట, జడ్చర్ల, బాదేపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఆదివారం మాజీ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పూజలు చేశారు. వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దేవరకద్ర : దేవరకద్ర, కౌకుంట్ల మండల కేంద్రాల్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయా మండపాల దగ్గర భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గణనాథుడికి పూజలు నిర్వహించారు.

నవాబ్‌పేట : మండలంలోని కూచూర్‌లో ఆదివారం హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు తానెం వీరస్వామి ఆధ్వర్యంలో గ్రామస్థులకు అన్నదానం నిర్వహించారు.

మూసాపేట : మండల కేంద్రంతో పాటు వేముల, నిజాలాపూర్‌, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి, జానంపేట, దాసరిపల్లి గ్రామాల్లో ఆలయ కమిటీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Updated Date - Sep 20 , 2026 | 11:19 PM