Share News

జాతీయ రహదారి పనుల అడ్డగింత

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:24 PM

హైదరాబాద్‌ - బెంగుళూరు 44వ నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.

జాతీయ రహదారి పనుల అడ్డగింత
నిలిచిపోయిన జాతీయ రహదారి విస్తరణ పనులు

- కాంగ్రెస్‌ నాయకుడి అనుచరుల హల్‌చల్‌

- పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్ట్‌ సంస్థ

- కేసు నమోదు కాకుండా రంగంలోకి పెద్దలు

- రక్షణ కల్పించాలని ఎన్‌హెచ్‌ఏఐకు లేఖ

గద్వాల, ఎర్రవల్లి జనవరి 11(ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ - బెంగుళూరు 44వ నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి నుంచి ఆలంపూర్‌ చౌరస్తా వరకు నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా మారుస్తూ నేషనల్‌ హైవే అథారిటీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ కొద్ది రోజులుగా పనులను కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ఓ ముఖ్య నాయకుడి అనుచరులు ఈనెల 6వ తేదీన పనులను అడ్డుకున్నారు. తమ నాయకుడితో ఒప్పందం కుదిరితేనే పనులు చేయాలి, లేదంటే నిలిపి వేయాలంటూ హుకుం జారీ చేశారు. అయినా పనులను కొనసాగిస్తుండటంతో బెదిరింపులకు దిగారు. డిమాండ్‌ మేరకు ఒప్పందం చేసుకోవాలని హెచ్చరించారు. లేదంటే పనులు ఆపేయాలని బెదిరించారు. దీంతో భయపడిన సైట్‌ ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, సిబ్బంది కాంట్రాక్టర్‌కు సమాచారం అందించి పనులను ఆపేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్‌ ఈ నెల 9వ తేదీన కోదండాపురం పోలీస్‌ స్టేషన్‌లో సదరు నాయకుడి అనుచరులపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం దీనికి సంబందించిన ఫిర్యాదు కాపీతో పాటు సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌ అయ్యింది. నేషనల్‌ హైవే అథారిటీ నిర్వహిస్తున్న పనులకు, కాంట్రాక్టర్‌కు పోలీసులు రక్షణ కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నేషనల్‌ హైవే అథారిటీ సీరియస్‌

కాంట్రాక్టర్‌ను, సిబ్బందిని బెదిరించి పనులను నిలిపి వేయడంపై కాంట్రాక్ట్‌ సంస్థ నేషనల్‌ హైవే అథారిటీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ నాయకుడి అనుచరులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, సిబ్బందిపై దాడికి దిగుతున్నారని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తామంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నది. రక్షణ కల్పించేంత వరకు తాము పనిచేయలేమని తేల్చి చెప్పింది. వారి సూచన మేరకే సదరు కాంట్రాక్టర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేయాలని నేషనల్‌ హైవే అఽథారిటీ అధికారులు కూడా పోలీసులను కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామని చెప్పారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని తెలిసి రాష్ట్రంలోని కొందరు నాయకులు జోక్యం చేసుకొని, కేసు నమోదు కాకుండా అడ్డుకుంటున్నారని సమాచారం. అయితే పోలీసులు మాత్రం, తమకు కాంట్రాక్ట్‌ సంస్థ నుంచి కానీ, నేషనల్‌ హైవే అథారిటీ నుంచి నేరుగా ఫిర్యాదు అందలేదని అంటున్నారు. కానీ సోషల్‌ మీడియాలో ఫిర్యాదు కాపీ హల్‌ చేస్తున్నదని చెప్తున్నారు. దీనిపైనా విచారణ చేస్తామని అంటున్నారు.

అడ్డం తిరిగిన కథ

కాంగ్రెస్‌ నాయకుడి అనుచరులు జాతీయ రహదారి పనులను అడ్డగించారని, పనులను ఆపేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయబ్రాంతుకు గురిచేశాడని ఆ కాంట్రాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. జాతీయ రహదారిపై పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ నల్లమట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా తాము ప్రశ్నించామని, దీంతో అతడు తమపై తప్పుడు ఆరోపణలు ఫిర్యాదు చేశాడని సదరు కాంగ్రెస్‌ నాయకుడి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఎవరినీ భయపెట్టలేదని, ప్రశ్నించినందుకు తమపైనే దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు బహిర్గతం చేయడం లేదు.

మాకు ఫిర్యాదు అందలేదు

కాంట్రాక్ట్‌ సంస్థ నుంచి, నేషనల్‌ హైవే అథారిటీ నుంచి మాకు ఫిర్యాదు అందలేదు. కానీ సోషల్‌ మీడియాలో ఒక ఫిర్యాదు వైరల్‌ అవుతున్నది. దానిపై విచారణ చేస్తాం.

- తరుణ్‌ కుమార్‌ రెడ్డి, కోదండాపురం ఎస్‌ఐ

Updated Date - Jan 12 , 2026 | 11:24 PM