నారాజ్..!
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:41 PM
కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువనే అంటారు.. ప్రభుత్వంలోనూ ఒకరిపై ఒకరు వి మర్శలు చేసుకోవడం సహజం..
- ప్రభుత్వంపై పదేపదే అనిరుధ్‌రెడ్డి విమర్శల బాణాలు
- గెలిచినప్పటి నుంచీ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్
- మంత్రులు, అధికారులు, కంపెనీలపై నేరుగానే అటాక్
- పార్టీకి, ప్రభుత్వానికి సంకేతాలపై ప్రజల్లో జోరుగా చర్చ
- సంచలన వ్యాఖ్యలు చేసి.. మిన్నకుండిపోవడంపై విమర్శ
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువనే అంటారు.. ప్రభుత్వంలోనూ ఒకరిపై ఒకరు వి మర్శలు చేసుకోవడం సహజం.. క్రమశిక్షణ చర్యలు అని ఏదో ఒకసారి కొందరిపై చర్యలు తీసు కున్నా.. మిగతా వారు భయపడతారని పార్టీ ఆశించినా ఆవేవి జరగవు.. విమర్శలు, ఆరోపణలు చేయడం నిత్యకృత్యమే.. ఇటీవల పార్టీకి, ఎమ్మె ల్యేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని కోల్పోగా.. కేబినెట్ నుంచి కొండా సురేఖను సైతం తప్పిం చారు. అయినప్పటికీ పార్టీలో ఉన్న స్వేచ్ఛ కారణంగా పలువురు చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని, పార్టీని చిక్కుల్లో పడేస్తాయి. తర్వాత ఎంత డిఫెండ్ చేసినా ప్రతిపక్షాలకు ఆయు ధం కావడం ఖాయంగానే ఉంటుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మొదటి నుంచి సంచలన వ్యాఖ్యలకు రాష్ట్రంలోనే కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నారు. ఏ ఒక్కరిపై కాకుండా ప్రభుత్వంపైనే పలు మార్లు విమర్శలు చేయడం, మంత్రులపై పరో క్షంగా ఆరోపణలు చేయడం, ముక్కుసూటిగా ఏదైనా మాట్లాడటం ఆయనకు పరిపాటిగా మారిందని చెప్పవచ్చు. పలుమార్లు ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇరుకున పడ్డ సంద ర్భాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతాయి. కొన్నింటిలో మంచిపేరు వచ్చినా.. కొన్ని వ్యాఖ్యల విషయంలో మాత్రం విమర్శలనూ ముటగట్టుకో వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే పదేపదే ఆయన పార్టీకి ఏం సంకేతాలు ఇస్తున్నారు అనే చర్చ కూడా ప్రజల్లో జోరుగా సాగుతోంది. తన నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సింది సాధించుకోవడం కోసం ఆయన ముక్కుసూ టిగా మాట్లాడుతుంటారని కొందరు చెబుతుండగా.. ఇంకొందరు మొదటి నుంచీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసమే వ్యాఖ్యలు చేస్తారనే ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వంలో, మంత్రుల వద్ద అంతర్గతంగా చెప్పాల్సిన మాటలు కూడా ప్రజాబాహుళ్యంలో చెబుతుండే సరికి పార్టీకి నష్టం కలిగే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు
అనిరుధ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజులకే డీజీపీని కలిసి తనకు నియోజకవర్గంలో ఎస్కార్ట్ వద్దని వినతిపత్రం ఇచ్చి సంచలనం కలిగించారు.. ఆ తర్వాత వివిధ కారణాల రీత్యా పోలీసుశాఖ ఎస్కార్ట్‌ను కొనసాగిస్తూనే ఉంది. తర్వాత రెవెన్యూలో జరిగే అవినీతిపై పోరాటం చేయాలని నిర్ణయించడం.. రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి క లుగజేసుకుని.. సర్దిచెప్పారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు చెల్లడం లేదని, చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో ఆయన పోరా టం ఫలించి.. తెలంగాణ ఎమ్మెల్యేలకు కోటా లభించడం.. ఆయన విజయంగా చెప్పవచ్చు. ఆంధ్రా కాంట్రాక్టర్లపై పలుమార్లు విమర్శలు చేసినప్పటికీ.. ఇప్పటికీ చాలామంది అలాగే కొనసాగుతున్నారు. పవన్‌కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపైనా విమర్శిస్తూ.. అప్పుడు హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నట్లు అని ప్రశ్నించారు. కాలుష్య కారకాలను నిర్మూలించకపోతే అరబిందోను కాలబడెతానని అల్టిమేటం జారీ చేశారు. సినీ పరిశ్రమ పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. డ్రగ్స్ నిర్ధార ణకు ముందుగా తన శాంపిళ్లు ఇస్తానని, నిజాయితీగా సినీ ప్రముఖులు కూడా రావాలని సూచించారు.. ఒకసారి ఎమ్మెల్యే అయ్యానని, రెండు సార్లు గెలిస్తే సీఎం కూడా అయితానని ప్రకటించుకున్నారు.. జడ్చర్లకు రూ. 5వేల కోట్లు తెస్తాన ని కూడా చెప్పారు. పరోక్షంగా నియోజకవర్గ లీడర్లపై సంచులు మోసే వారు పార్టీకి అక్కర్లేదు.. ఫ్యాక్షనిస్టులకు మా పార్టీలో స్థానం లేదని చెప్పారు.. సర్పంచు పదవి కోసం తమ్ముడిని చంపిన వ్యక్తిని పార్టీలోకి తీసుకోబోమని కూడా ప రోక్ష విమర్శలు చేశారు. నల్గొండ, ఖమ్మం నేతలే నిధులన్నీ తీసుకుపోతున్నారని అన్నారు. సారా తాగి గతంలో 100 నుంచి 115 ఏళ్లు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అన్నారు. ఇప్ప పువ్వు సారాను ఆమోదించి.. బ్రాండింగ్ చేయాలని మాట్లాడారు. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు చాలాసార్లు సంచలన వ్యాఖ్యల చేశారు. అయితే ఓవైపు సంచలన వ్యా ఖ్యలు చేస్తూనే.. మరోవైపు పార్టీపై, ప్రభుత్వం పై, సీఎం రేవంత్‌రెడ్డిపై గొప్పగా మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి.. అప్పుడే విమర్శించి.. అప్పుడే మళ్లీ గొప్పగా చెప్పడం కూ డా ఆయనకే సాధ్యమవుతుంది. తాను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డితో అనేక సభలు నిర్వహించి.. విజయవంతం చేశారు. ఇటీవల దసరా ఉత్సవాలకు సైతం సీఎం రేవంత్‌రెడ్డిని జడ్చర్లకు రప్పించారు.
నిధుల కోసం విమర్శలు
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నిధుల విషయంలో అనిరుధ్‌రెడ్డి కొంత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సైతం లెక్కచేయకుండా ముక్కుసూటిగా విమర్శలు చేస్తు న్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కోసం అనేకసార్లు మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు సీఎంను కలిసి విన్నవించారు. అయితే ఇప్పటివరకు కొన్ని నిధులు తీసుకురాగా.. ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు తాజాగా ఆర్అండ్బీ రోడ్లకు బిల్లులు రాకపోవడంపై మాట్లాడుతూ.. నిధులు ఇవ్వకుంటే 30వేల మందితో ఆమ రణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. తాను చచ్చిపోతేనే నిధులు వస్తాయంటే చావడానికి సిద్ధమని కూడా చెప్పారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక ఆర్అండ్బీ కాంట్రాక్టర్ చనిపోయిన తర్వాత బిల్లులు ఇచ్చారని, తాను కూడా చనిపోయిన తర్వాత రూ. 40 కోట్ల బిల్లుల నిర్ణయం తీసుకుంటారా? అని నిలదీశారు. మంత్రుల నియోజకవర్గాలకు బిల్లులు ఇస్తూ.. మిగతా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకపోవడం ఏమిటని తనదైన శైలిలో విమర్శించారు. కొన్ని నియోజకవర్గాలు కాదు.. అన్ని నియో జకవర్గాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందు తుందని అన్నారు. అయితే గతంలో కంటే భిన్నంగా ఈసారి పార్టీలకు అతీతంగా జడ్చర్ల అభివృద్ధికి ప్రజలు ఏకం కావాలని పిలుపున్విడంలో ఏదైనా మతలబు ఉందా? అనే చర్చ కూడా నడుస్తోంది. కోమటిరెడ్డిని రాజకీయ గురువు అ ని చెబుతూనే బిల్లులు ఇవ్వకపోతే ఎదురు తిరుగుతానని, భట్టి పాదయాత్ర సందర్భంగా సభ భారీగా నిర్వహించామని, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని పేర్కొన్నారు. అనిరుధ్‌రెడ్డి తన వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని చాలా సార్లు ఇరకాటంలో పెట్టడం, ప్రతిపక్షాలకు ఆయుధాలను ఇవ్వడం పరిపాటిగా మారిందని చెప్పవచ్చు.