నల్లమల పిలుస్తోంది
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:18 PM
ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు.. వన్యప్రాణాలను చూసి ఆనందించేందుకు.. భారీ వృక్షాల నడుమ.. అటవీ దారుల వెంట.. సాగుతూ సంతోషించేందుకు.. రా.. రమ్మని పిలుస్తోంది నల్లమల. జంతువుల సంతానోత్పత్తి సమయం కావడంతో జూలై నుంచి సెప్టెంబరు వరకు నల్లమల అడవిలోని పర్యాటక ప్రాంతాల సందర్శనపై 90 రోజుల పాటు అటవీశాఖ నిషేఽధం విధించింది.
- 90 రోజుల తర్వాత తెరుచుకుంటున్న అటవీ దారులు
- నేటి నుంచి ప్రారంభం కానున్న జంగిల్ సఫారీ
- సందడిగా మారనున్న పర్యాటక కేంద్రాలు
అచ్చంపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు.. వన్యప్రాణాలను చూసి ఆనందించేందుకు.. భారీ వృక్షాల నడుమ.. అటవీ దారుల వెంట.. సాగుతూ సంతోషించేందుకు.. రా.. రమ్మని పిలుస్తోంది నల్లమల. జంతువుల సంతానోత్పత్తి సమయం కావడంతో జూలై నుంచి సెప్టెంబరు వరకు నల్లమల అడవిలోని పర్యాటక ప్రాంతాల సందర్శనపై 90 రోజుల పాటు అటవీశాఖ నిషేఽధం విధించింది. ఆ గడువు ముగియడంతో ఈనెల ఒకటవ తేదీ నుంచి అటవీ దారులు తెరుచుకోనున్నాయి.. గురువారం నుంచి ‘జంగల్ సఫారీ’ని ప్రారంభించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది..
వనమాలిక నుంచి వ్యూ పాయింట్ వరకు..
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీశాఖ కార్యాలయం వనమాలిక నుంచి ప్రారంభమయ్యే సఫారీ టూర్ ఫర్హాబాద్‌లోని వ్యూపాయింట్ వరకు కొనసాగుతుంది. నల్లమల అటవీ ప్రాంతం పర్యాటక ప్రాంతాలకు నెలవు. 2166.37 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అభయారణ్యంలో 44 పెద్దపులులు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన గణనలో వెల్లడయ్యింది. సఫారీ టూర్‌కు వెళ్లే పర్యాటకులకు పెద్దపులులు, చిరుతలు, కనిపించే అవకాశం ఉంది. జింకలు, దుప్పులు, వివిధ రకాల అరుదైన పక్షులు కనిపించి కనువిందు చేస్తాయి. 914 మీటర్ల ఎత్తులో ఉండే వ్యూ పాయింట్ నుంచి కనిపించే దృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అలాగే అడవిలోని పురాతన కట్టడాలు, దేవాలయాలను సందర్శింవచ్చు. జంగిల్ సఫారీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అటవీశాఖ నిబంధనల మేరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
మళ్లీ సందడే సందడి
అటవీ శాఖ ఆంక్షలతో 90 రోజుల పాటు పర్యాటకుల సందడి లేక బోసపోయిన నల్లమలలోని పర్యాటక కేంద్రాలు ఇకపై సందడిగా మారనున్నాయి. ప్రధానంగా వ్యూపాయింట్, ఆక్టోపస్, ఫర్హాబాద్ ప్రాంతాల్లో వన్యప్రాణులను తిలకించవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే పర్యాటకులు, భక్తులు నల్లమలలోని ప్రముఖ శైవక్షేత్రాలు సలేశ్వరం, మల్లెలతీర్థంతో పాటు ప్రతాపరుద్రుడి కోట, నిజాం విడిగి కేంద్రాలను సందర్శించుకోవచ్చు.