పాటల ఫిరంగి
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:00 AM
తన గానంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గాన గాంధర్వుడు మన సాయిచంద్ అని చెప్పవచ్చు. పాఠశాల స్థాయి నుంచే గాయకునిగా ఉన్న సాయిచంద్ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అనే పాట ఓ వేదికపై పాడే అవకాశం వచ్చింది..
- మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గాత్రంతో మలుపు తిప్పిన సాయిచంద్
- అమరచింతలో జన్మించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు
- రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అనే పాటతో అరంగేట్రం
- నేడు సాయిచంద్ మూడవ వర్ధంతి
మలిదశ తెలంగాణోద్యమాన్ని మలుపు తిప్పిన ప్రజా వాగ్గేయకారుల్లో సాయిచంద్ ఒకరు. రాతిబొమ్మలో కొలువైనా శివుడా అమ్మ అర్తనాదం విలువ నీకు తెలియదా అంటూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ సాయిచంద్ ఆలపించిన పాట ఇప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది. ‘‘అయ్యోడివా నీవు అమ్మోడివా’’ అంటూ అతను ప్రదర్శించిన ధిక్కారం ఇప్పటికీ తెలంగాణ వాదుల్లో కొలువైంది. నాలుగు పదుల వయస్సు లోపలే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పడంలో తన ఆటపాటల ద్వారా మైమరిపించిన సాయిచంద్ సామాన్య కుటుంబంలో జన్మించాడు. తండ్రి, పెద్దన్న విప్లవ భావజాలంతో ముడిపడిన అనుబంధం సాయిచంద్‌ను తెలంగాణలోనే అతికొద్దిమంది ప్రజాగాయకుల్లో ఒకరిగా నిలిపింది. వేద సాయిచంద్ వేదిక ఎక్కాడంటే చాలు జన హృదయాలు ఆవేశం, ఆవేదనతో పొంగిపొర్లేవి అంటే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ కోసమే పాడతానన్న సాయిచంద్ తాను తుది శ్వాస వీడిచే వరకు అందుకనుగుణంగా కట్టుబడి ఉండడం అతని నిబద్దతతకు నిలువెత్తు నిదర్శనం. సాయిచంద్ 2023 జూన్ 29న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బిజినేపల్లి మండలం కార్కొండలోని తన చిన్న వ్యవసాయ క్షేత్రంలో గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయనపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
- నాగర్‌కర్నూల్, అమరచింత (ఆంధ్రజ్యోతి)
తన గానంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గాన గాంధర్వుడు మన సాయిచంద్ అని చెప్పవచ్చు. పాఠశాల స్థాయి నుంచే గాయకునిగా ఉన్న సాయిచంద్ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అనే పాట ఓ వేదికపై పాడే అవకాశం వచ్చింది.. అదే వేదికపై ఉన్న కేసీఆర్ సాయిచంద్ పాటకు మంత్రముగ్ధులు కావడంతో పాటు కంటతడి పెట్టుకున్నారు. ఈ పాట యావత్ తెలంగాణ ప్రజల మనసును కదిలించింది. ఇదే పాట సాయిచంద్ జీవితాన్ని ఓ మలుపు తిప్పిందని చెప్పవచ్చు.
సాయిచంద్ కుటుంబ నేపథ్యం
వేద సాయిచంద్ అప్పట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని అమరచింతలో 1984 ఆగస్టు 20న వెంకటరమణ, మణెమ్మ దంపతులకు రెండవ సంతానం. స్థానికంగా ఒకటి నుంచి 3వ తరగతి వరకు లిటిల్ ప్లవర్ పాఠశాల, 4 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 6 నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ హైస్కూల్లో చదువుకున్నారు. 2001-03ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 2003-06వరకు హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో గల ఎస్‌వీఎస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 2007 నుంచి 2010వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లిటరేచర్ పీజీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ అప్లై చేసినప్పుడే తెలంగాణ ఉద్యమం బాట పట్టినట్లు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే పీడీఎస్‌యూ హైదరాబాద్ సిటీ సెక్రటరీగా, అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సాయిచంద్ పని చేశారు. ఇంటర్ చదువుతున్నప్పుడే తల్లి మృతి చెందారు. తండ్రి వెంకటరాములు, న్యూడెమోక్రసీ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ అరుణోదయ కళాకారుడిగా అనేక పాటలు పాడేవాడు. 2011లో రజినితో సాయిచంద్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
నల్గొండ వేదిక నుంచే వెలుగులోకి వచ్చిన సాయిచంద్
ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారితో కలిసి సాయిచంద్ ఉండేవారు. ఒక్కసారిగా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమం కోసం 2009లో తన ప్రాణాలర్పించడంతో సాయిచంద్ తీవ్రంగా కలత చెందినట్లు తెలిసింది. అదే క్రమంలో నల్గొండ జిల్లా కేంద్రంలో శ్రీకాంతాచారి సంస్మరణ నిర్వహించడం ఆ సభలో వేదికపై సాయిచంద్‌కు పాట పాడే అవకాశం వచ్చింది. తాను రాసిన రాతిబొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట పాడడంతో అదే వేదికపై ఉన్న కేసీఆర్‌కు కంటతడి పెట్టించడంతో పాటు సాయిచంద్ పాడిన తీరు హృదయాన్ని హత్తుకుంది. దీంతో వేలాది వచ్చిన జనాలు సాయి పాటకు మంత్రముగ్ధులై కంటతడి పెట్టారు. అప్పటి నుంచి రసమయి కొనసాగిస్తున్న ధూంధాంలో సాయిచంద్‌కు కేసీఆర్ అవకాశమిచ్చి వెంట పెట్టుకున్నారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్ చేపట్టిన అనేక సభల్లో తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ రాష్ట్ర ప్రజల్లో సాయిచంద్ చెదరని ముద్ర వేసుకున్నారు. తన గళంతో మంత్రముగ్ధులను చేశాడు. 2014లో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సాయిచంద్ తనదైన కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు.
బీఆర్‌ఎస్ పార్టీలోనూ సముచిత స్థానం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్‌ను మాత్రం విస్మరించలేదు. ప్రభుత్వ పథకాలు, అధికారిక కార్యక్రమాలు కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల్లో సాయిచంద్ లేనిదే ఆ సభ జరిగేది కాదు. రాష్ట్రంలో ఏ మూలన సభ జరిగినా ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్యాబినెట్ మంత్రులు చెప్పిన ఆ సభలో సాయి ఉన్నాడు. ఎంత ఆలస్యమైనా జనాలను ఆపగలుగుతాడని కేసీఆర్ నమ్మకంగా చెప్పేవాడు. అదే నమ్మకంతో కేసీఆర్ 2019లో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్, 2021లో ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ టికెట్లను ప్రకటించి అనివార్య కారణాల వల్ల విరమించుకున్నాడు. 2021లో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌గా సాయిని నియమించాడు. ఆ పదవిలో 19నెలల పాటు కొనసాగిన సాయి హఠాన్మరణం సంభవించింది.
29న అమరచింతలో సాయి మూడవ వర్ధంతి
సాయిచంద్ మూడవ ఈ నెల 29న అమరచింతలో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సాయిచంద్ సతీమణి మాజీ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ రజిని అమరచింతలో సాయిచంద్ విగ్రహం ఇది వరకే ఏర్పాటు చేశారు. 29న అమరచింతలో జరిగే వర్ధంతి సభకు మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలను సాయిచంద్ అభిమానులను పిలిచి వర్ధంతి సభ చేసే యోచనలో ఆయన సతీమణి రజిని ఉన్నట్లు తెలిసింది.
సాయిచంద్ ఆశయాలను కొనసాగిస్తా
- రజిని సాయిచంద్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్
తన భర్త దివంగత సాయిచంద్ ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో శ్రమించారు. ఆయన ఆశయాలను కొసాగిస్తాను. ప్రజా గొంతుకగా నిలబడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తన భర్త రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతగానో పని చేశారు. ఆయన గుర్తుగా ఆయన జన్మించిన అమరచింతలో సాయి విగ్రహం ఏర్పాటు చేశాను. సాయి మన మధ్యల లేకున్నా ఆయన పాట ప్రతీ గ్రామంలో ఆయన అభిమానుల్లో చిరస్మరణీయంగా ఉంది. 29వ తేదీన సాయిచంద్ వర్ధంతిని ఆయన అభిమానుల మధ్య నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం.