ప్రజా సమస్యలను వదిలేసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:45 PM
వ్యక్తిగత హైప్ కోసమే ప్రజా సమస్యలను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పక్కన పెట్టారని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
- బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి
జడ్చర్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వ్యక్తిగత హైప్ కోసమే ప్రజా సమస్యలను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పక్కన పెట్టారని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉందని, వార్తల్లో నిలబడడానికి మాట్లాడుతున్నాడో తెలియదని, కానీ జడ్చర్ల అసెంబ్లీ పేరు పాపులర్ అవుతుందని ఎద్దేవా చేశారు. సొంత ప్రభుత్వంలో ఉంటూనే అధికారులపై గతంలో దాడి చేశాడని, నేడు అధికారులపై లంచాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించిన ఎమ్మెల్యేనే లంచగొండి అంటూ ప్రజలు అంటున్నారన్నారు. అధికారులు లంచాలు తీసుకుంటుంటే, ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు. 30వేల మందితో ఆమరణ నిరాహర దీక్షకు కూర్చుంటానని, తాను చనిపోయినా సరే కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలని అన్న ఎమ్మెల్యే, దీక్షకు ఎప్పుడు కూర్చుంటావో తేదీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల చౌరస్తాలో టెంటు వేసి, ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే అంటూ బ్యానర్లు పెట్టించి మద్దతు తెలుపుతామంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఉండి ఆమరణ నిరాహర దీక్ష చేపట్టిన తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు వస్తుందంటూ చురకంటించారు. ఎమ్మెల్యే సోదరుడేమో ఇసుక, మట్టి వ్యాపారం చేస్తుంటే, వాళ్ల అమ్మ సెటిల్మెంట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ నాయకులు ముచ్చర్ల కృష్ణయ్య, రాపోతుల శ్రీనివాస్‌గౌడ్, బాలకృష్ణ, అమర్నాథ్గౌడ్, శ్రీనాథ్, విశ్వనాథచారి ఉన్నారు.