నిబంధనలకు విరుద్ధంగా.. మాంసం విక్రయాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:29 PM
దేవరకద్ర మునిసిపల్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కనే దుమ్ము ధూళిలో చికెన్, మటన్ విక్రయాలు కొనసాగతున్నా.. మునిసిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
- పట్టించుకోని మునిసిపల్ అధికారులు
దేవరకద్ర, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : దేవరకద్ర మునిసిపల్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కనే దుమ్ము ధూళిలో చికెన్, మటన్ విక్రయాలు కొనసాగతున్నా.. మునిసిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వంతెన కింద, రోడ్డు పక్కనే చికెన్, మటన్ విక్రయాలు కొనసాగించడంతో ఈగలు, దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కానీ సంబంధిత విక్రయదారులు అవేవీ పట్టించుకోకుండా విక్రయించడంతో కొనుగోలు దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు గుండా సివిల్ కోర్టు న్యాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, ట్రేజరి అధికారి, పోస్టాఫీసు, గ్రంథాలయం, పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో విక్రయదారులు రోడ్లపై వ్యర్థ పదార్థాలు, నీళ్లు చట్టడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు.
పేపర్ ధర కంటే అధికంగా వసూలు..
మునిసిపల్ అనుమతి లేకుండానే చికెన్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు చికెన్‌ను పేపర్ ధర కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో అనుమతి ఉన్న దుకాణాల్లో చికెన్ లభించని పక్షంలో రోడ్లపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న చికెన్ వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలో దాదాపు 16 షాపులు ఉండగా, మునిసిపల్ నుంచి కేవలం 5 షాపులకు మాత్రమే అనుమతి ఉంది. 11 షాపులకు అనుమతి లేకున్నా మునిసిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో మునిసిపాలిటీకి ఆదాయం తగ్గిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జీవాలను పరీక్షించని అధికారులు..
మటన్ వ్యాపారులు జీవాలను వధించేందుకు ముందుగా మునిసిపల్ అధికారులు పరిశీలించి, జీవాలకు ముద్ర వేస్తారు. వాటినే వధించి మాంసం విక్రయించాలి. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇళ్ల వద్దనే జీవాలను వధించి రోడ్లపై విక్రయిస్తున్నారు.