నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:21 PM
ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అధికారులు, సర్పంచులను ఆదేశించారు.
- ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- వారంలో గ్రామ సమస్యలు గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలి
హన్వాడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అధికారులు, సర్పంచులను ఆదేశించారు. సోమవారం హన్వాడ మండల సర్యసభ్య సమావేశం ఎంపీడీవో యశోదమ్మ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా ఎమ్మల్యే హాజరయ్యారు. సభలో అధికారులు తమ ఎజెండా అంశాలను వివరిస్తుండగా, పలు గ్రామాల సర్పంచులు సమస్యలను తెలిపారు. విద్యుత్, తాగునీటి సమస్యలపై సభ్యులు అధికారులను నిలదీశారు. ప్రధానంగా విద్యుత్ సరాఫరా సక్రమంగా లేదని ఇబ్రహింబాద్, రామన్నపల్లి గ్రామాల సర్పంచులు సభలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతోందని, అందుకు నీటి వనరులను కాపాడుకుందామన్నారు. నీటిని వృథా చేయరాదని అందుకు గ్రామాల్లో పాలకవర్గం శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి అన్ని చర్యలు తీసుకుంటానని వివరించారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి సర్పంచులు అడిగిన ప్రతీ అంశాన్ని పరిశీలించి వారంలో సమగ్ర నివేదికను తయారు చేయాలన్నారు. పండుగలోపు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రపంచలోనే గుర్తింపు వచ్చిందని, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి అభినందిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల నుంచి ఏమైనా ఆశిస్తే సహించేది లేదన్నాను. మూడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాయ చైర్మన్ నర్సింహ్మరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీవో జగదీశ్ పాల్గొన్నారు.
విద్యుత్ కోతలు నివారించాలి
మండలంలో బోరుబావులకు అందాల్సిన త్రీఫేస్ కరెంట్ సక్రమంగా సరాఫరా కావడం లేదని రోజూ కోతలు విధించడంతో పంటలు ఎండుతున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ఎమ్మెల్యే కారు ఆపి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సొసైటీ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు బాలరాజు, మాజీ సర్పంచులు చెన్నయ్య, వెంకన్న, జంబులయ్య, మన్నన్, యాదయ్య, సురేష్ పాల్గొన్నారు.
మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట
పాలమూరు : మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో పశువ్యాధి నిర్ధారణ, శాంపిల్స్ సేకరణ, సురక్షిత రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక వాహనాన్ని కలెక్టర్ ఖుష్బూగుప్తా, జిల్లా పశువైద్య, సంవర్థక అధికారి శివానందస్వామితో కలిసి ఆవిష్కరించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పశువుల నుంచి రక్తం ఇతర నమూనాలు సేకరించి ల్యాబ్‌కు చేర్చడం ద్వారా సకాలంలో వ్యాధిని గుర్తించి, ప్రాణాపాయాన్ని నివారించవచ్చు అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సేకరించిన శాంపిల్స్‌ను ప్రయోగశాలలో వేగంగా పరీక్షించి ఫలితాలను వెంటనే సంబంధిత పశువైద్యులకు చేరవేసేలా సమన్వయ వ్యవస్థను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ఇతర ప్రాంతాలకు రోగాలు వ్యాప్తిచేయకుండా అడ్డుకోవచ్చన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జీజే బెనహార్, గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతన్న, నాయకులు సిరాజ్‌ఖాద్రి, మైత్రియాదయ్య, ఫయాజ్, డాక్టర్ నరేష్‌కుమార్ పాల్గొన్నారు.