విత్తనమేళాను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:16 PM
ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన విత్తనమేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
అయిజలో ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
అయిజ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన విత్తనమేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం అయిజ పట్టణంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో డిమాండ్ ఉన్న 7రకాల వరి వంగడాలను మాత్రమే సాగుచేయాలని సూచించిందని, వాటిని మాత్రమే రైతులు సాగు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యత తక్కువగా ఉండే గ్రామాల్లో వ్యవసాయాధికారులు సూచించిన మేరకు కందులు, వేరుశనగ, కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. నానోయూరియా, డీఏపీని వినియోగించేలా అధికారులు, డీలర్లు రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. యూరియా యాప్‌ను ప్రారంభించి రైతులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కంది విత్తనాలను పంపిణీ చేశారు. డీలర్లు ఏర్పాటు చేసిన విత్తనాలు, ఎరువుల స్టాల్స్‌ను పరిశీలించి నిబంధనల ప్రకారం రైతులకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధి కారి వీరప్ప, ఆత్మ అధికారి జగ్గునాయక్, ఏఓ జనార్దన్, తహసీల్దార్ జ్యోతి, మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.