Share News

గ్రామ పంచాయతీలకు మహర్దశ

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:37 PM

గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరమైన స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రామ పంచాయతీలకు మహర్దశ
డోకూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం

- ట్రెజరి విధానానికి స్వస్తి.. నేరుగా పంచాయతీలకు నిధులు

- త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వ గ్రాంట్లు

దేవరకద్ర, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరమైన స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో ఇకపై గ్రాంట్లు నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మాత్రమే నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలకు చేరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ట్రెజరీ వ్యవస్థ ద్వారా బిల్లుల ఆధారంగా విడుదలయ్యేవి. దీంతో అభివృద్ధి పనులు, కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చుల చెల్లింపులో జ్యాపం నెలకొనేది. జీపీలు అభివృద్ధికి నోచుకోవడానికి అడ్డంకులు ఉండేవి. నూతన విధానంతో జీపీలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. గతంలో గ్రామాల నుంచి వసూలు చేసిన ఇంటి ట్యాక్సులతో పాటు నీటి పన్నులు అధికారులు ట్రెజరీ కార్యాలయంలో జమ చేసేవారు. అనంతరం వాటిని గ్రామ అభివృద్ధికి వినియోగించుకునేందుకు ట్రెజరీ కార్యాలయం నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు నెలల తరబడి జాప్యం జరిగేది.

ట్రెజరీలతో సర్పంచులకు ఇబ్బంది

ట్రెజరీ విధానం కారణంగా పంచాయతీలు ప్రతీ ఖర్చుకు బిల్లులు సమర్పించి అధికారుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. నిధుల విడుదల ఆలస్యం కావడంతో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోయేవి. కొన్ని సార్లు ప్రతిపాదించిన మొత్తాలకు కోత విధించి నిధులు విడుదల కావంతో సర్పంచులు ఇబ్బందులకు పడేవారు.

Updated Date - Nov 04 , 2026 | 10:37 PM