Share News

చేద్దాం.. సహజ సేద్యం

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:29 PM

వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటం అనర్థాలకు దారి తీస్తోంది.

చేద్దాం.. సహజ సేద్యం

- ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం

- యాసంగి నుంచే సాగుకు కసరత్తు

- జిల్లాలో రైతులకు శిక్షణ తరగతులు

వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటం అనర్థాలకు దారి తీస్తోంది. భూసారం దెబ్బతిని పంటలు పండని స్థితి నెలకొంటోంది. అవసరానికి మించి ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంటలు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పోత్సాహం అందిస్తోంది. సహజ సాగుపై రైతులకు శిక్షణ ఇస్తోంది.

- పాలమూరు (ఆంధ్రజ్యోతి)

సహజ వ్యవసాయం ప్రకృతికి, ప్రజలకు మేలు చేస్తుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌-2024) అమలు చేస్తోంది. అందులో బాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రైతులకు నిపుణులతో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాగు విస్తీర్ణాన్ని నిర్దేశించి, యాసంగిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం జిల్లాను 20 క్లస్టర్లను గుర్తించారు. ఒక్కో క్లస్టర్‌లో 125 మంది రైతులను ఎంపిక చేశారు.

పొలాల నుంచి మట్టి సేకరణ

భూసార పరీక్షల కోసం 2,500 మంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. ఆ పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా ఆ భూమిని సహజ సాగుకు యోగ్యంగా మార్చాల్సి ఉంటుంది. అందుకోసం రైతులకు ఆరు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వచ్చే యాసంగి సీజన్‌ వరకు ఒక్కో రైతు కనీసం ఒక్కో ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీరో బడ్జెట్‌తో సహజ వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ.2 వేల చొప్పున రెండు విడతలుగా ఇవ్వనున్నారు. ముందుగా మహిళా సంఘంలో సభ్యులైన వారిలో ‘కృషి సఖి’ లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారితో ఇతర రైతులందరికీ అవగాహన కల్పిస్తారు. రైతులకు ఎకోక్లబ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలోనే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

భూసార సంరక్షణకు ప్రాధాన్యం

భూసారం, సాగు విధానం, యాజమాన్య పద్దతులపై పంటల దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందులో మట్టిలోని పోషక విలువలు కీలక భూమిక పోషిస్తాయి. రైతులు పంటల సాగుకు నత్రజని, భాస్వరం, పోటాష్‌లాంటి ప్రధాన పోషకాలను మాత్రమే వినియోగిస్తున్నారు. మిగతా పోషకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసార పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా నేలకు అవసరమైన పోషకాలను సహజ పద్ధతిలో పెంపొందించేలా రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు.

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి

భూమిలో సహజంగా ఉండే జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ పంటలకు ఉపయోగపడే మిత్రపురుగులు, కీటకాలను కాపాడుకునేలా సహజ సేద్యం ఉంటుంది. పశువుల ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడంతో రైతులు ఆశించిన ఫలితాలు పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాగులో జీవ నియంత్రణ పద్ధతులకు, వృక్ష సంబంధమైన కషాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బిజామృతంతో విత్తనశుద్ధి, జీవామృతంతో పురుగులను ఆదుపుచేసి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటించాలి. ఇలాంటి అన్ని విషయాలపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:29 PM