మహిళలను వేధిస్తే చట్టపరమైన చర్యలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:04 PM
పని ప్రదేశంలో మహిళలను వేధిస్తే పోష్ యాక్ట్ - 2013 ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజని తెలిపారు.
- వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజని
వనపర్తి రాజీవ్ చౌరస్తా, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : పని ప్రదేశంలో మహిళలను వేధిస్తే పోష్ యాక్ట్ - 2013 ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజని తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా, ఐడీవోసీ సమావేశ మందిరంలో గురువారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లోకల్ కంప్లయింట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలతో పాటు, ఇళ్లల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. బాధితులు 90 రోజుల్లో ఇంటర్నల్ కమిటీకి లేదా షీబాక్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ జిల్లాలో 64 శాఖల్లో ఇంటర్నల్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోకల్ కమిటీని ఏర్పాటు చేసినందున పని చేసే చోట లైంగిక వేధింపులకు గురైతే మహిళలు సంకోచించకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లోకల్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీలేఖ, జీసీడీవో సుబ్బలక్ష్మీ, శ్రీదేవి, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ చిన్నమ్మ థామస్, డీసీపీవో రాంబాబు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.