గణనాథుడు ఒడి చేరగా.. గంగ విడుము పరమేశా!
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:08 AM
గణనాథుల నిమజ్జనం కోసం.. గంగమ్మను పంపించాలంటూ.. గణేశ్ ఉత్సవ నిర్వాహకులు పరమేశ్వరుడిని వేడుకుంటు న్నారు.
- వినాయక ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు
- వర్షాభావంతో వాగులు, చెరువులకు చేరని నీరు
- బీచుపల్లి వద్ద కృష్ణానదిలోనూ అదే పరిస్థితి
- ఉత్సవ నిర్వాహకుల్లో నిమజ్జనం టెన్షన్
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 11 (ఆంధ్ర జ్యోతి) : గణనాథుల నిమజ్జనం కోసం.. గంగమ్మను పంపించాలంటూ.. గణేశ్ ఉత్సవ నిర్వాహకులు పరమేశ్వరుడిని వేడుకుంటు న్నారు. వర్షాభావంతో చెరువుల్లో నీరు లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 14 నుంచి వినాయక్ చవితి ఉత్సవాలు ప్రారం భం కానున్నాయి. వేడుకలను భారీగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసు కుంటున్నారు. గతం కన్నా పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఉత్సవాల్లో తుది ఘట్టమైన నిమజ్జనంపై మా త్రం అందరిలో సందిగ్ధం నెలకొన్నది. ఎల్‌నినో ప్రభావంతో, వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో చెరువులన్నీ నీ రు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని చెరువుల్లో అంతోఇంతో నీరున్నా భారీ విగ్రహాలు మునిగే పరిస్థితి లేదు. దీంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలన్న ఆందోళన మొదలైంది. కొందరు నిర్వాహకులు పెద్ద విగ్రహాలకు ముందుగానే ఆర్డర్ ఇచ్చి ప్రత్యేకంగా తయా రు చేయించుకున్నారు. మరికొందరు ఉత్సవా లు ప్రారంభం అయ్యే నాటికి చెరువులకు నీళ్ళు వస్తాయన్న ఆశతో పెద్ద విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఐదవ రోజు నుంచి నిమ జ్జనం ప్రారంభమై 10 రోజుల్లో ముగుస్తుంది. ఈ సారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 వేలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిం చనున్నారు. ఒక్క పాలమూరు నగరంలోనే 1,500 వరకు విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. వాటిని బీచుపల్లి, బండ్రవల్లి, హన్వాడ చెరు వుల్లో ఎక్కువగా నిమజ్జనం చేసేవారు. ఇప్పు డా పరిస్థితి కనిపించడం లేదు. బీచుపల్లి వద్ద కృష్ణానదిలోనూ నీరు లేకపోవడంతో అందరి దృష్టి శ్రీశైలంపైనే పడుతుంది. కానీ, అక్కడికి అందరూ విగ్రహాలను తీసుకెళ్ళడం సాధ్యం కా దు. ఈ నేపథ్యంలో నిమజ్జనం ఎక్కడ నిర్వ హించాలన్నది నిర్వాహకులకు పెద్ద సమ స్యగా మారింది.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం
ప్రతీ సంవత్సరం జూన్‌లో వర్షాలు మొద లవుతాయి. జూలైలో మోస్తరు వర్షాలు, ఆగస్టులో భారీ వర్షాలు కురిసి ఈ సమయా నికి చెరువులన్నీ అలుగులు పారేవి. ఎల్‌నినో ప్రభావంతో అందుకు భిన్నమైన పరిస్థితి నెల కొన్నది. జూన్‌లో కాస్తా వర్షాలు కురిసినా, జూలై నాటికి పూర్తిగా తగ్గిపోయాయి. ఆగస్టు లోనూ ఇదే పరిస్థితి.. సెప్టెంబరు ప్రారంభమై 11 రోజులు గడిచినా చుక్క వర్షం పడలేదు. జిల్లా వ్యాప్తంగా 30 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. మరో వారం, పది రోజుల్లో వర్షాలు కూడా కురిసే పరిస్థితి లేదు. అందుకే గణపతి ఉత్సవాలు ప్రారంభం కాకముందే అందరిలోనూ నిమజ్జనం ఎక్కడ చేయాలన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికా ర యంత్రాంగం నీరు చేరిన చెరువులను వెతి కే పనిలో నిమగ్నమయ్యింది. నగరం చుట్టూ ఉన్న చెరువుల్లో కొంతవరకు నీరు ఉండటం తో విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల ని అధికారులను ఆదేశిస్తున్నారు.
చెరువు పేరు కోసం తర్జన భర్జన
జిల్లాలో మండపాలు ఎన్ని, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఎంత ఎత్తయిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు? ఎన్ని రోజు లు ఉత్సవాలు నిర్వహిస్తారు? ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను నిర్వాహకులు ముందుగానే పోలీస్ పోర్టల్ లో నమోదు చేసి, అనుమతులు తీసుకో వాల్సి ఉంటుంది. నిమజ్జనం ఏ చెరువులో చేస్తారో అందులో పేర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఏ చెరువు పేరు పెట్టాలో తెలియక నిర్వాహకులు తర్జన భర్జన పడుతున్నారు. తాము గతం లో విగ్రహాలను నిమజ్జనం చేసిన చెరువు ల్లో ప్రస్తుతం నీరు లేకపోవడం సమస్య గా మారింది. దీంతో చాలా మంది నిర్వా హకులు ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకో వడంలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.