ప్రశ్నించడం నేర్చుకోవాలి
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:44 PM
‘ఎస్టీ, ఎస్సీలకు అన్యాయం జరుగొద్దు.. తమ హక్కుల కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలి.. ప్రశ్నించకపోతే బానిసలం అవుతాం
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
నారాయణపేట క్రైం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ‘ఎస్టీ, ఎస్సీలకు అన్యాయం జరుగొద్దు.. తమ హక్కుల కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలి.. ప్రశ్నించకపోతే బానిసలం అవుతాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నారాయణపేట జిల్లా కేం ద్రంలో బుధవారం ఆయన పర్యటించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రియాంక, ఎస్‌పీ డాక్టర్ వినీత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆయనకు పోలీసులు గౌరవవందనం సమర్పించగా, అధికారులు పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు చేకూరిన లబ్ధిని అధికారులు వివరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రతీ నెల చివరి వారం నిర్వహించే సివిల్ రైట్స్‌డే కు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పని చేస్తున్న అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్‌వో రాజేశ్వరి, ఆర్డీవో రమేశ్, ట్రైనీ కలెక్టర్లు శ్రీరాం ప్రణీత్, ఫణి కుమార్, డీఎస్పీ లింగయ్య, పాల్గొన్నారు.