లక్ష్మారెడ్డి వర్సెస్ అనిరుధ్‌రెడ్డి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:46 PM
పాలమూరు జిల్లాలో రాజకీయ విమర్శలకు జడ్చర్ల నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారుతోంది.
- రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతున్న జడ్చర్ల
- అభివృద్ధి, అవినీతి, నిధుల విడుదలపై పరస్పర మాటల దాడి
- వంద పడకల ఏరియా ఆసుపత్రి వాస్తుపై విమర్శల బాణాలు
- ఆసుపత్రి కోసం ఖాళీ స్థలం ఇవ్వడంపైనా ఎవరి వాదన వారిదే..
- తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటున్న ఎమ్మెల్యే, మాజీ...
ఆంధ్రజ్యోతి, మహబూబ్‌నగర్ ప్రతినిధి
పాలమూరు జిల్లాలో రాజకీయ విమర్శలకు జడ్చర్ల నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు సహజమే అయినా.. అది కొంచెం హద్దు మీరుతోంది. విమర్శలను ఇరువైపులా సానుకూలంగా తీసుకుంటే.. ఎలాంటి నష్టం ఉండ దు.. కానీ వరుస మాటల యుద్ధానికి సిద్ధమవుతుండటం కనిపిస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుఽధ్రెడ్డి.. వ్యక్తిగతంగా దుందుడుకు శైలిలో ఉంటారు.. సంచలన వ్యాఖ్యలు చేయడం, సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించడం ఆయనకు అలవాటే.. ప్రతిపక్షం ప్రత్యేకంగా కౌంటర్ ఇవ్వా ల్సిన అవసరం లేకుండా తానే మాట్లాడుతుంటారు.. ఏకంగా బిల్లులు ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేస్తానని కూడా ఇటీవల ప్రకటించి.. సంచలనం సృష్టించారు. రాజాపూర్ మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఆసుపత్రి నిర్మా ణం కోసం ఖాళీ స్థలంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నుంచి రాజకీయ దుమారం మొదలైంది. ఆ తర్వాత రోజే మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులపైనా.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపైనా విమర్శలు చేశారు. గురువారం మళ్లీ అనిరుధ్‌రెడ్డి స్పందిస్తూ మాటల దాడిని కొనసాగించారు. అవినీతి, అభివృద్ధి చి ట్టాలు విప్పుతామంటూ అల్టిమేటం జారీ చేసు కుంటున్నారు. చాలా రోజులుగా స్తబ్ధుగా ఉన్న నియోజకవర్గ రాజకీయాలు డాక్టర్ లక్ష్మారెడ్డి చేసిన ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ వ్యాఖ్యలతో హుషారుగా మారాయని చెప్పవచ్చు. విలేకరుల సాక్షిగా శుక్రవారం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాజీ మంత్రి అవినీతి చి ట్టాను విప్పుతానని చెప్పారు. ప్రజలకు సేవ చేస్తుంటే రాజకీయాలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. ఈ మాటల దాడి ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. శుక్ర వారం నిర్వహించే ప్రెస్‌మీట్ తర్వాత బీఆర్ఎస్ క్యాంపు కూడా మళ్లీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు మూడేళ్లవుతుండగా.. మరో రెండేళ్ల సమయం ఉండగానే రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయని చెప్పవచ్చు.
అభివృద్ధి, నిధులపై చర్చ
నియోజకవర్గంలో రాజకీయ పోటీ వాతావరణం ఉండటం వల్ల ఒకరికి మించి.. ఒకరు అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజలకు మంచే జరుగుతుంది. అయితే పోటీ వాతావరణం విమర్శల వరకే పరిమితం కాకూడదని, అభివృద్ధి కాంక్షతో విమర్శలు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి మూడుసార్లు సీఎం రేవంత్‌రెడ్డి వస్తే.. ఎమ్మెల్యే నిధులు అడగలేదని విమర్శలు చేయగా.. దసరా పండుగకు అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రిని నిధులు అడగాలని మాజీ మంత్రి సూచించడం సరికాదని, ఉదండాపూర్ పరిహారం రూ. 650 కోట్ల, నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేయించామని, సీఎంను నిధులు అడగకుండానే ఇవి వచ్చాయా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఒక మాట అంటే పది మాటలు అంటా అని కూడా చెప్పారు. లోపలి ఇంట్లో మాట్లాడుకుని.. నిధులివ్వకపోతే చస్తాననడం, రాజకీయ గురువైన మంత్రి నిధులు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఎద్దేవా చేయగా.. భూములపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని, మంత్రిగా ఉన్నప్పుడు జడ్చర్ల ఆసుపత్రిని ఎందుకు అభివృద్ధి చే యలేదని ప్రశ్నించారు. ఇప్పుడు నియోజకవర్గంలో విరి విగా పర్యటనలు చేస్తున్న అనిరుధ్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఈ మాటల యుద్ధాన్ని ఎంతదూరం తీసుకె ళ్లారో వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికే వీరి మాటల యు ద్ధం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్‌గా మార గా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సోషల్ హ్యాండిళ్లలోనూ జోరు గా చర్చ సాగుతోంది. పాతవి, కొత్తవి ఆరోపణలు, వి మర్శలు ముందట వేసుకుని ఇదే పనిగా ఇరువర్గాల నాయకులు పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఆస్పత్రి హాట్‌టాపిక్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జడ్చర్లలోని వంద పడకల ఏరియా ఆస్పత్రి నిర్మాణంపై చర్చ జరుగుతూనే ఉంది. ఆస్పత్రిని గుంతలో కట్టారని గతంలో నుంచే ఎమ్మెల్యే విమర్శలు చేస్తుండగా.. ఇటీవల రాజాపూర్‌లో ఎమ్మెల్యే స్పందిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జడ్చర్ల ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఖాళీ స్థలం ఉందని, గతంలో అన్నమాదిరిగా ఆస్పత్రిని మాజీ మంత్రి నిర్మించి ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనికి స్పందనగా మాజీ మంత్రి ఆసుపత్రి కోసం మూడెకరాల స్థలం అవసరమని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం కూల్చేసి.. ఆ స్థలాన్ని వైద్యారోగ్యశాఖకు అప్పగిస్తే.. ఇచ్చిన వెంటనే సొంత నిధులతో ఆస్పత్రిని నిర్మించి ఇస్తామని, ఇవన్నీ నెలరోజు ల్లోపు పూర్తిచేయాలని లక్ష్మారెడ్డి ప్రతిస్పందించారు. ఎక్కడ స్థలం ఇస్తారనే విషయం చెప్పకుండా మూడెకరాల స్థలం ఇస్తామని, మాజీ మంత్రి ఆసుపత్రిని నిర్మించాలని గురువారం మళ్లీ ఎమ్మెల్యే బదులిచ్చారు. అయితే ఆసుపత్రి విషయంలో పూర్తిస్థాయి సిబ్బంది లేక తరచూ ఇబ్బందులున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో ఓసారి ఆసు పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినగా.. తాజాగా మృతదేహం కళ్లిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. పాత ఆస్పత్రి భవనంలో ఓపీ లేదు.. అదే సమ యంలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం, దానివల్ల పోయిన వాస్తుపైన కూడా రాజకీయ విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. మొదట వంద పడకల ఆస్పత్రిని నిర్మించేటప్పుడు వాస్తులో భాగంగా ఉత్తర భాగంలో ఖాళీ స్థలం ఉంచామని, ఇప్పుడు అదే స్థలంలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మించడం వల్ల వాస్తు తప్పిందని మాజీ మంత్రి విమర్శించారు. దీనికి బదులు వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆసుపత్రిపై ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే స్పందించారు. శుక్రవారం ఏర్పాటు చేయబోయే విలేకరుల సమావేశం మాటల యుద్ధానికి ఎలా కొనసాగింపుగా మారుతుందో వేచిచూడాలి.