ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:28 PM
ఫార్మర్ రిజిస్ట్రీపై రైతులు ఆసక్తి చూనడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో గుంట నుంచి ఎంత భూమి ఉన్న రైతు అయినా తప్పని సరిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
- పాలమూరు జిల్లాలో పూర్తి కాని ప్రక్రియ
- జిల్లాలో 2,65,041 మంది పట్టాదారులు
- నమోదు చేసుకోని వారు 96,366 మంది
పాలమూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఫార్మర్ రిజిస్ట్రీపై రైతులు ఆసక్తి చూనడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో గుంట నుంచి ఎంత భూమి ఉన్న రైతు అయినా తప్పని సరిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు దీనినే ప్రమాణికంగా తీసుకుంటారు. పంట రుణాలు, కరువు నష్టపరిహారం, విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ, ధాన్యం విక్రయం తదితర లావాదేవీలకు ఫార్మర్ రిజిస్ట్రీ, రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం, చక్రాపూర్ గ్రామంలో గత ఏడాది మే 5వ తేదీన అప్పటి కలెక్టర్ విజయేందిరబోయి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 17 నెలలు అవుతున్నా జిల్లాలో 63 శాతం మంది రైతులు మాత్రమే వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇంకా 37 శాతం మంది రైతులు వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంది. కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు.
1,68,675 మంది వివరాల నమోదు
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 2,65,041 మంది పట్టాదారు రైతులు ఉన్నారు. వారిలో 1,68,675 మంది ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఇంకా 96,366 మంది వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంది. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 6,59,017 ఎకరాల భూమి ఉంది. అందులో అటవీ ప్రాంతం 49,798 ఎకరాలు ఉండగా, సాగు యోగ్యమైన భూమి 5,35,134 లక్షల ఎకరాలు ఉంది. జిల్లా వ్యవసాయాధికారి కే గోవిందునాయక్ ఆధ్వర్యంలో 86 క్లస్టర్ల పరిధిలో 84 మంది ఏఈవోలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రెండు ఏఈవోల పోస్టులు ఖాళీగా ఉండగా, ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించారు. కొందరు రైతులు స్థానికంగా ఉండకపోవటం, మరికొందరి ఫోన్‌నెంబర్లు అనుసంధానం కాక, ఓటీఈ రాకపోవడం, తదితర సమస్యలతో నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
మీ సేవ కేంద్రాల్లో నమోదు
జిల్లాలోని రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రస్తుతం స్థానికంగ ఉండే మీ సేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో రైతులు ఆసక్తి చూపటంలేదు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోనే అతి తక్కువ 50శాతం నమోదు చేసుకోవటం సరికాదు. అఽత్యదికంగ భూత్పూర్,దేవరకద్ర,గండీడ్ మండలాల్లో అత్యధికంగ 68శాతం చేసుకోవటం సంతోషకరం.
- కె.గోవిందునాయక్, జేడీఏ
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
ఫార్మర్ రిజిస్ట్రీ వంద శాతం పూర్తి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. అందుకోసం రైతులు తప్పనిసరిగా వివరాలను నమోదు చేయించుకొని, గుర్తింపు కార్డు పొందాలి.
- సురేశ్, ఏఈవో, మూసాపేట మండలం