కేసీఆర్, కేటీఆర్ గజదొంగలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:22 PM
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు గజదొంగలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
- పాలమూరు ప్రజలు ద్రోహులుగా పరిగణిస్తారు
- మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ న్యూటౌన్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు గజదొంగలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పాలమూరు ప్రజలు ద్రోహులుగా పరిగణిస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈవీఎం గోదాంను ఖాళీ చేయించకుండా నిర్మాణం పూర్తి ఎలా చేస్తారని మాజీ మంత్రిని ప్రశ్నించారు. ఆయన రాజకీయాలకు అనర్హుడన్నారు. తమ హయాంలో జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్, ఐఐఐటీ, లా కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి హయాంలో పాలమూరు యూనివర్సిటీకి నిధులు కూడా తీసుకురాలేక పోయారని ఆరోపించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకుడు మారెపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనితారెడ్డి, నాయకులు రాషేద్ ఖాన్, పాషా, ఒమర్, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.