కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:22 PM
పేదల బతుకులను బాగు చేసేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
- పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి
గండీడ్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పేదల బతుకులను బాగు చేసేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గండీడ్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశ హాజరై మాట్లాడారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోందన్నారు. నగరం నుంచి రిజనల్ రింగ్ రోడ్డు మన నియోజకవర్గం నుంచి కొడంగల్ వరకు నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. పరిగి నియోజకవర్గానికి సాగు నీరుతెచ్చి చెరువులు నింపి రైతుల రుణం తీర్చుకుంటామన్నారు. మండలంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య, లో వోల్టేజీ సమస్య, విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కొమిరెడ్డిపల్లిలో విద్యార్థులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారని సర్దుబాటులో మరో ఉపాధ్యాయుడిని తీస్తామని అధికారులు అంటున్నారని, అలా అయితే విద్యార్థులు నష్టపోయి ప్రభుత్వ బడులపై నమ్మకం పోతోందన్నారు. జీపీడీపీ నిధులు అభివృద్ధి పనులకు వాడుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని సర్పంచు సుజాత అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనం అక్షయపాత్ర ద్వారా అందించేలా కృషి చేయాలని ఎంఈవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గండీడ్, వెన్నచేడ్, సల్కర్‌పేట్ రైతు వేదికల్లో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. మండల ప్రత్యేకాధికారి వెంకట ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవోలు మంజుల, నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌గోపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతలక్ష్మా రెడ్డి, పుల్లారెడ్డి, జితేందర్‌రెడ్డి, పులిందర్‌రెడ్డి, సర్పంచులు భగవంత్‌రెడ్డి, లక్ష్మిబాయి, సుజాత, సరోజ, హేమలత, చెన్నారెడ్డి, టీక్యానాయక్ పాల్గొన్నారు.
సర్పంచులకు బదులుగా కుటుంబ సభ్యులు
మండలంలోని రుసుంపల్లి సర్పంచు భీమమ్మ కాగా, ఆమె కొడుకు భీమయ్య సభలో పాల్గొన్నారు. జిన్నారంతండా సర్పంచు కేతావత్ దూళిబాయి కాగా, ఆమె భర్త కిషన్ నాయక్ పాల్గొని, గ్రామంలో నీటి సమస్య తీర్చాలని అధికారులను నిలదీయడంతో సమస్య పరిష్కరాస్తామని అధికారులు బదులివ్వడం గమనార్హం. అదే విధంగా కొందరు సమస్యలపై దృష్టి పెడితే.. మరి కొందరు మాత్రం వారి సెల్ ఫోన్ చూస్తు కాలక్షేపం చేస్తుండడం గమనార్హం.