Share News

రేవంతన్నా అంటే.. గుండె పులకిస్తోంది..!

ABN , Publish Date - Nov 26 , 2026 | 11:58 PM

పాలమూరు బిడ్డగా.. నల్లమలలో పుట్టిన వ్యక్తిగా రేవంతన్నా.. అంటే నా గుండె పులకించిపోతోందని, ఈ ప్రాంతాన్ని తాను దత్తత తీసుకోవడం కాదు.. కృష్ణానది జలాలతో తడపాల్సిన బాధ్యత తనదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు.

రేవంతన్నా అంటే..  గుండె పులకిస్తోంది..!
వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- ఈ ప్రాంతబిడ్డగా కృష్ణానది జలాలతో తడపాల్సిన బాధ్యత నాదే..

- రక్తాన్ని చెమటగా మార్చి దేశంలో అచ్చంపేటను ఆదర్శంగా చేస్తా..

- ఐదేళ్లు ఎంపీగా అన్నంపెడితే పాలమూరుపై ఆలోచన చేయలే..

- మాట మీద ఉండటం.. నిజాయితీగా ఉండటం నల్లమల వారసత్వమే..

- ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రత్యేక రాష్ట్రంలోనూ పాలమూరుకు అన్యాయం

- పదేళ్లలో ఏం చేశారు.. మూడేళ్లలో ఏం చేశామనేది చర్చకు పెట్టండి

- అచ్చంపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : పాలమూరు బిడ్డగా.. నల్లమలలో పుట్టిన వ్యక్తిగా రేవంతన్నా.. అంటే నా గుండె పులకించిపోతోందని, ఈ ప్రాంతాన్ని తాను దత్తత తీసుకోవడం కాదు.. కృష్ణానది జలాలతో తడపాల్సిన బాధ్యత తనదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో రూ. 450 కోట్లతో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ చీరలు, చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి.. సభలో ప్రసంగించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం రూ. 1.80లక్షల కోట్లు ఖర్చు చేస్తే పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులకు రూ. 10వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ఎంపీగా గెలిపించి అన్నంపెట్టిన ప్రజల గుండెమీద తన్ని మెదక్‌ జిల్లాకు పారిపోయిన గజదొంగ కేసీఆర్‌ అని విమర్శించారు. పాలమూరు అంటే నీతి, నిజాయితీకి మారుపేరని, ఎక్కడ ఏ పనివారు కావాలన్నా.. పాలమూరు వారే కావాలంటారని అన్నారు. నమ్మితే సొమ్ము అయ్యే జాతికి కేసీఆర్‌ అన్యాయం చేశారని, పదేళ్లు పడావు పెట్టారని ఆరోపించారు. ఈ ప్రాంత బిడ్డగా చేయాల్సిన అభివృద్ధి కోసం సర్వం ఒడ్డుతానని, రక్తాన్ని చెమటగా మార్చి అభివృద్ధి చేసి అచ్చంపేటను ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతానని అన్నారు. అచ్చంపేట ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని, ద్వాదశ జ్యోతిర్లింగ కేంద్రమైన శ్రీశైలానికి ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరం ఒకవైపు.. తెలంగాణ ప్రాంతానికి రక్షకుడిగా నిలిచిన మహిమాన్వితుడు మద్దిమడుగు ఆంజనేయుడు మరోవైపు.. తెలంగాణ అమర్‌నాథ్‌గా ఉన్న కొంగు బంగారం సలేశ్వరం లింగమయ్య ఇంకోవైపు.. పౌరాణిక ప్రాశాస్ర్త్యానికి అటు శాతవాహనులు, విష్ణకుండినులు, చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, రేచర్ల రెడ్డి నాయకులు, కుతుబ్‌షాహీ సుల్తానులు, నిజాంలు పాలించిన చారిత్రక నేపథ్యానికి, చెంచు గిరిజనుల స్పష్టమైన జీవనానికి అలవాలమైన నేల ఇదన్నారు.

అచ్చమాంబ పేరుతో అచ్చంపేట

తెలంగాణలో మరే ప్రాంతానికి లేని ప్రత్యేకతలు కలిగిన అచ్చంపేటలో అడుగుపెడితే 14వ శతాబ్దంలో అల్లావుద్దిన్‌ ఖిల్జీ సేనాధిపతి మాలిక్‌కాఫర్‌ను ఎదిరించి నిలిచి గెలిచిన ఆడబిడ్డ అచ్చమాంబ వీరత్వం గుర్తుకొస్తోందన్నారు. వీర వనిత అచ్చమాంబ పేరుతో రూపుదిద్దుకున్న పట్టణమే అచ్చంపేట అని, అదే వారసత్వాన్ని నేటికీ ఈ నేల కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. భారత దేశ తొలిమహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పరిపాలన చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లు, చీరలు, కుటుంబబీమా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రాచరికం నుంచి విముక్తి పొంది.. బ్రిటీష్‌ తెల్లదొరలను దిగంతాలకు తరమికొట్టి.. స్వతంత్రాన్ని అందించి.. ఏ మాత్రం రాచరికం ఉండకూడదని, నియంతలు ఉండకూడదని ప్రజాపాలకులు ఉండాలని, అయిదేళ్లకోసారి సేవకులను ఎన్నుకునే హక్కు పేద ప్రజలకు ఇవ్వాలని నెహ్రూ, గాంధీ, అంబేడ్కర్‌లు రాజ్యాంగాన్ని రూపొందించి 1949, నవంబర్‌ 26న ఆమోదించారని అన్నారు. ఓటు హక్కు ఆయుధాన్ని అందరికీ సమానంగా ఇచ్చి.. 1950 జనవరి 26న అమలు చేసి.. 1952లో ఎన్నికలు నిర్వహించారన్నారు. ఆనాడు కరువుతో, అక్షరాస్యత లేక, పంటలు పండక, వరదలు ఉప్పెనై కమ్ముతున్న పరిస్థితుల నుంచి నాటి మొట్టమొదటి ప్రధాన మంత్రి నెహ్రూ దేశం బాగుపడాలంటే.. ఎడ్యూకేషన్‌, ఇరిగేషన్చ్‌ను మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నారని అన్నారు. నాడు తీసుకున్న నిర్ణయాలతోనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎ్‌సపీ, భాక్రానంగల్‌లాంటి ప్రాజెక్టులని అన్నారు. ఆనాడే ప్రారంభించి.. పూర్తిచేసింది కాబట్టే కోట్లాది ఎకరాల బీడు సాగై.. ఆహార కొరత తీరిందన్నారు. ప్రతీ మూడు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, అయిదు కిలోమీటర్లకు హైస్కూల్‌, మండలానికి జూనియర్‌ కాలేజీ, జిల్లాకు యూనివర్సిటీ, డివిజన్‌కు డిగ్రీ కాలేజీలను ఇచ్చామని, ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మన బిడ్డలు శాసిస్తున్నారని గుర్తుచేశారు.

విప్లవ నాయకుడిగా సంబోధించాలి : ఎంపీ డాక్టర్‌ మల్లు రవి

దేశంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని ఇకపై విప్లవ నాయకుడని పిలవాలని నాగర్‌కర్నూలు ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. రేవంత్‌రెడ్డి ఏమీ చేయలేదని ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు చెబుతున్నారని, చెవులుంటే విని, కళ్లుంటే ఈ పనులను చూడాలన్నారు. రూ. 450 కోట్లతో అచ్చంపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించారన్నారు. అలాగే ఈ గడ్డ నుంచే కోటిమంది మహిళలకు గొప్ప రంగుతో లబ్ధిదారుల్లా కాకుండా ఇంటి బిడ్డగా కానుకగా చిలుకపచ్చ చీరలు అందజేస్తున్నారని అన్నారు. అలాగే 4.50 లక్షల మందికి చేయూత పింఛన్లను పంపిణీ చేసింది చూడాలన్నారు. ఆయా జాతుల సంక్షేమం కోసం, చైతన్యం కోసం పనిచేసిన సంత్‌సేవాలాల్‌, చాకలి అయిలమ్మ, పండుగ సాయన్న, సర్దార్‌ పాపన్నగౌడ్‌లకు సముచిత స్థానం కల్పించింది రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యారంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు.

జాతిని జాగృతం చేసిన సేవాలాల్‌ : మంత్రి జూపల్లి కృష్ణారావు

సంత్‌సేవాలాల్‌ సమాజాన్ని జాగృతం చేసిన నాయకుడికి ఈ రోజు సముచిత గౌరవం లభించిందని, ఆయన విగ్రహం, ఆలయ నిర్మాణం కాంగ్రెస్‌ ప్రభుత్వ గొప్ప విజయమని పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అచ్చంపేట, బల్మూరు, అమ్రాబాద్‌, లింగాల, పదర, తెలకపల్లి, ఉప్పునుంత మండలాల్లో 75 వేల ఎకరాలకు నీరిచ్చేందుకు నిర్ణయం జరిగిందన్నారు. త్వరలో కేబినెట్‌ ముందుకు వచ్చి ఆమోదం పొందబోతుందని వెల్లడించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అచ్చంపేట నియోజకవర్గంలో మరో 81 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. మొత్తం వెనుకబాటులో ఉన్న ఈ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు నీరివ్వబోతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మంత్రి వాటికి శ్రీహరి మాట్లాడుతూ.. దేశంలో చరిత్రలో బడుగు బలహీన వర్గాల లెక్క ఎంతో చెప్పేందుకు ఎవరూ సాహసించలేదని, మొదటిసారి సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను లెక్క గట్టేందుకు కులగణన చేశారని, దీనివల్ల మనం ఎంత ఉన్నామో తెలిస్తే.. హక్కులు ఆ విధంగా కల్పించాలని, సముచిత స్థానం దక్కాలని చేసిన కృషికి ఇది నిదర్శమన్నారు.

ప్రజాభద్రత కోసం ప్రభుత్వం పనిచేస్తోంది : మంత్రి దామోదర రాజనర్సింహ

నవంబర్‌ 26న అంబేద్కర్‌ దేశంలో ఉన్న ప్రజలు అందరూ సమానత్వంతో జీవించాలని రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాజ్యంగ మౌలిక సూత్రాలను అమలు చేస్తూ మహిళా సాధికారత, రైతు సంక్షేమం కోసం పని చేస్తోందన్నారు. సామాజిక భద్రత 35 నెలల్లో 6 లక్షల పింఛన్లు అందిస్తున్న ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదన్నారు. మహిళా సాధికారతలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, రూ. 79వేల కోట్ల రుణాలకు సంబంధించి రూ. 2వేల కోట్ల వడ్డీ డబ్బులు చెల్లించామన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతీ పౌరుడూ చదువుకోవాలని, విద్యాధికులు కావాలని, నైఫుణ్యంతో కూడిన విద్యను అందించాలని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, ప్రీప్రైమరీ, పొద్దున బ్రేక్‌పాస్ట్‌ ప్రభుత్వ రంగంలో అందచేస్తున్నామన్నారు. ఆరోగ్యం, విద్యా భద్రత, సామాజిక భద్రత, మహిళా సాదికారత లక్ష్యాలుగా పనిచేస్తున్నామని అన్నారు.

సంఘాల్లో చేరితే సంఘటితం : మంత్రి సీతక్క

రాష్ట్రంలో మహిళా సం ఘాల్లో లేనివారు కూడా సంఘాల్లో చేరాలని, అలా చేరితేనే సంఘటితంగా ఉం టామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సంఘాల్లో ఉండటం ద్వారా అక్కాచెల్లెల్లా ఉండి.. ఎవరికి కష్టమొచ్చిన పది మంది తోడుంటారని, ఊరిలో అయితే వంద మంది ఉంటారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలు సంఘాల్లో ఉన్నారని గుర్తుచేశారు. 12 లక్షల మంది మహిళలకు వారి భర్తలు, సంతానంపై ఆధారపడకుండా ఉండేందుకు అమ్మకు అక్షరమాల పేరుతో పరీక్ష పెట్టామని, అందులో పాస్‌ అయ్యారని, పదో తరగతి పరీక్షలు కూడా వారితో రాయిస్తామన్నారు. ఇకపై వారి లెక్కలు వారే చూసుకుంటారని, ఇంట్లో బడ్జెట్‌ అయినా.. బస్సుల లెక్కలయినా.. వారే చేసుకుంటారని అన్నారు. రాష్ట్రంలో పింఛన్‌ రానివారిని గుర్తించి అందజేస్తామని అన్నారు. గతంలో తెలంగాణ పేరుతో మోసం చేసినట్లు ఇప్పుడు కూడా మో సం చేద్దామని కొందరు చూస్తున్నారని, అలా అనుకోవడం పొరపాటని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు.

Updated Date - Nov 26 , 2026 | 11:58 PM