Share News

కాంగ్రెస్‌లో జోష్‌..!

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:21 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మునిసిపాలిటీ ఎన్నికల సంరంభం ముగిసింది. కార్పొరేషన్‌ సహా, 18 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.

కాంగ్రెస్‌లో జోష్‌..!

- వరుస ఎన్నికల్లో విజయంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం

- పట్టణాల్లోనూ గతంలో లేనంతగా సత్తా చాటిన అభ్యర్థులు

- బీఆర్‌ఎస్‌లోనూ ఉత్సాహం, ‘అసెంబ్లీ’పై పెరుగుతున్న ధీమా

- పుంజుకున్న కమలం... ఓట్లు, సీట్లు పెరగడంతో సంతోషం

- లోపాలను సరిదిద్దుకుంటే భవిష్యత్‌ ఉంటుందనే హెచ్చరిక

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మునిసిపాలిటీ ఎన్నికల సంరంభం ముగిసింది. కార్పొరేషన్‌ సహా, 18 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌ పీఠంతో పాటు 14 మునిసిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న అలంపూర్‌ నియోజకవర్గంలోని రెండు మునిసిపాలిటీల్లో గులాబీ గుబాళించగా.. ఎంపీ డీకే అరుణ పుట్టిన ప్రాంతమైన నారాయణపేటలో కమలం వికసించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవ అని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శిస్తున్నాయి. అయితే వరుస ఎన్నికల్లో గెలుపు ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత లేదని, బలం ఉందని ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు కౌంటర్‌ చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఏ ఎన్నిక నిర్వహించినా, విజయం సాధిస్తుందని సవాల్‌ చేస్తున్నాయి. పరిషత్‌ ఎన్నికల్లోనూ తమ పార్టీ సత్తా చాటుతుందని, అదే ధీమాతో మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తామని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అనేక విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల వల్లనే అనేక మునిసిపాలిటీల్లో అభ్యర్థులను మార్చడం, డమ్మీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడంతో చాలామంది ఓటమి చెందారు. పకడ్బందీగా టిక్కెట్ల కేటాయింపు జరిగి ఉంటే మరిన్ని వార్డులు దక్కేవని ఆ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కీలెరిగి వాత

ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటరు ప్రతీసారి భిన్నంగా ఆలోచిస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అటువైపు మొగు ్గచూపినప్పటికీ అవసరమైనప్పుడు కీలెరిగి వాతపెట్టడం అలవాటు.. ఆయా పార్టీల నాయకత్వానికి ఒంటెత్తు పోకడ ఎక్కువైప్పుడు.. కేడర్‌ను లెక్క చేయనప్పుడు.. తనకు తానే గొప్ప అనుకున్నప్పుడు.. ప్రజలను చిన్నచూపు చూసినప్పుడు ఓట్ల రూపంలో వాత పెడతారు. అలా వాత పెడుతున్నారనే విషయం గ్రహించిన నేతలు తమ పద్ధతి మార్చుకుంటారు.. గ్రహించలేని వారు ప్రతీ ఎన్నికలోనూ అదే దుందుడుకు స్వభావంతో చేదు ఫలితాలను అనుభవిస్తారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి విజయం అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. చాలాచోట్ల ఏకపక్షంగా గెలుపును అందివ్వలేదు. కార్పొరేషన్‌ సహా అయిదు మునిసిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. ఒక మునిసిపాలిటీని బీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలవగా.. ప్రజలతో నిత్యం ఉండి.. దగ్గరగా వారి సమస్యలు పరిశీలిస్తుండే వారికి ఎలాంటి విజయం దక్కుతుందో ఏఐఎఫ్‌బీ నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఓడించిన వడ్డేపల్లి శ్రీనివాసులు విజయం నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ అసెంబ్లీ ఫలితాలే రిపీట్‌ అయ్యాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండి మూడు మునిసిపాలిటీల్లో రెండు దక్కించుకోగా.. ఒక్క మునిసిపాలిటీని కూడా కాంగ్రెస్‌ దక్కించుకోలేకపోయింది. ఎక్కడ కేడర్‌కు ప్రజలకు దూరం అవుతున్నారు... ఏఏ పనులు హామీ ఇచ్చి చేయలేదు... తమ వద్దకు వివిధ వినతులతో వచ్చిన వారికి ఎంత సమయం కేటాయిస్తున్నాం.. నియోజకవర్గంలో హాజరు శాతం ఎంత ఉంటుంది అనే విషయాలను చాలా బాగా ఓటర్లు గమనిస్తున్నారని చెప్పవచ్చు. అందుకే ఎక్కడా ఏకపక్ష విజయాన్ని అందించలేదు. కేవలం కోస్గి మునిసిపాలిటీ మాత్రమే క్లీన్‌ స్వీప్‌ అయ్యింది. మంత్రులిద్దరూ 100 శాతం మునిసిపాలిటీలను కైవసం చేసుకోగా, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్‌, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా తమ మునిసిపాలిటీలను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

పుంజుకున్న ఇతర పార్టీలు

సాధారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. సీట్ల సంఖ్యలో పెద్దగా తేడా తెలియకపోయినప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం తేడాను కచ్చితంగా గమనించవచ్చు. ఉదాహరణకు పాలమూరు కార్పొరేషన్‌ను తీసుకుంటే.. కాంగ్రెస్‌కు 35.54 శాతం ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌కు 26.64 శాతం ఓట్లు, బీజేపీకి 17.95 శాతం, ఇతర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 19.86 శాతం ఓట్లు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షానికి అధికార పార్టీ సీట్ల పరంగా చూసుకుంటే సగం బలం తక్కువగా ఉండగా.. ఓట్ల శాతం చూసుకుంటే కేవలం 9.30 శాతం మాత్రమే అధికార పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. గతంతో పోల్చితే బీఆర్‌ఎస్‌ చాలా పుంజుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆ శ్రేణుల్లో కూడా సంబరం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత పుంజుకుని అధికారంలోకి వస్తామని నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బీజేపీ కూడా ఉమ్మడి జిల్లాలో ఒక మునిసిపాలిటీని దక్కించుకోగా.. అన్నింటిలో ప్రభావం చూపింది. అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి, కోస్గి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, కొత్తకోట మినహా అన్నిచోట్ల ఖాతా తెరిచింది. గతంలో కంటే ఓటు బ్యాంకును కూడా పెంచుకుంది. ఒకవేళ 2029లో జమిలి ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మా, పెరుగుతున్న ఓటు బ్యాంకుతో అధికారంలోకి వస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

Updated Date - Feb 17 , 2026 | 11:21 PM