Share News

చోరీ సొమ్ముతో జల్సాలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:42 PM

చోరీలకు పాల్పడి జల్సాలకు ఖర్చు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

చోరీ సొమ్ముతో జల్సాలు
కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ శంషొద్దీన్‌

- నిందితుడి అరెస్టు

- 25 తులాల బంగారం, 182 తులాల వెండి స్వాధీనం

- వెల్లడించిన సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ శంషొద్దీన్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : చోరీలకు పాల్పడి జల్సాలకు ఖర్చు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, బిజినేపల్లి మండలం లోని మమ్మాయిపల్లి, శాయిన్‌పల్లి గ్రామాల్లో జరిగిన ఏడు దొంగతనాల కేసులను పోలీసులు చేధించారు. నాగర్‌కర్నూల్‌ సీఐ అశోక్‌రెడ్డి, బిజినేపల్లి ఎస్‌ఐ శంషొద్దీన్‌ శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. బిజినపల్లి మండలంలో 2023, 2025, 2026లో ఏడు చోరీలు జరిగాయి. మమ్మాయిపల్లి గ్రామంలో జరిగిన చోరీకి సంబంధించి బాధితురాలు రజియా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కసరి శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఎలక్ట్రిషియన్‌ మేస్త్రీగా పని చేస్తున్న అతడు శాయిన్‌పల్లిలో ఐదు, మమ్మాయి పల్లిలో రెండు చోరీలు చేసినట్లు అంగీకరిం చాడు. తాను దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను తల్లికి కూడా తెలియకుండా తన ఇంట్లోనే గుంత తవ్వి దాచి పెట్టాడు. చోరీ చేసిన నగదును సొంత ఖర్చులకు వినియోగించుకున్నాడు. 35 తులాల వెండి వడ్డాణాన్ని అమ్ముకుని మద్యం తాగి జల్సాలు చేసుకున్నాడు. అతడి నుంచి 25.1 తులాల బంగారం, 182 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకొని కోర్టులో డిపాజిట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన ఎస్‌ఐ శంషొద్దీన్‌, కానిస్టేబుల్‌ భీముడు, హోంగార్డు శివ రమేశ్‌లను అభినందించారు.

Updated Date - Aug 21 , 2026 | 11:42 PM