ఆరుతడారుతోంది
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:08 PM
ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ఉమ్మడి పాలమూరు జిల్లాపై కరుణ చూపడం లేదు. ఎగువ నుంచి ఇప్పటికే బిరాబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టాల్సి ఉండగా.. కనీసం వరద జాడ కూడా కనిపించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా తగ్గిన పంటల సాగు
వానాకాలంలో సాగు లక్ష్యం 22.54 లక్షల ఎకరాలు
ఇప్పటివరకు సాగైంది కేవలం 7.75 లక్షల ఎకరాల్లోనే..
ఆరుతడి పంటల సాగుకు దాటుతున్న అదును
కృష్ణా నది వరదపైనే ప్రధానమైన వరి సాగు భవితవ్యం
భారీగా తగ్గిన మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటల సాగు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ఉమ్మడి పాలమూరు జిల్లాపై కరుణ చూపడం లేదు. ఎగువ నుంచి ఇప్పటికే బిరాబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టాల్సి ఉండగా.. కనీసం వరద జాడ కూడా కనిపించడం లేదు. జూన్, జూలై నెలల్లో ఆరుతడి పంటల సాగు పూర్తి చేయాల్సిన రైతులు ఆకాశంవైపు ఆబాగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా సా గ య్యే వరి రైతులు కృష్ణానదికి వరదలు ఎ ప్పుడు వస్తాయోనని తుకాలు పోసుకుని నిరీక్షిస్తున్నారు. వెరసి వానాకాలం పంటల సాగు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే సాగు లక్ష్యంలో సగమైనా చేరుకుని.. పంటకాలం పూర్తయితే గొప్ప అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పాలమూరు జి ల్లాలో వానాకాలం సాగు లక్ష్యం 22,54,713 ఎకరాలు కాగా.. ఇ ప్పటివరకు 7,75,167 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యా యి. అందులో పత్తి వాటానే 5,89,167 ఎకరాలు కావడం గమనార్హం. అవిపోను 1.86 లక్షల ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు సాగయ్యాయి. గతేడాది వానాకాలంలో 21.16 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది అందులో సగం కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారుల అంచనాల ప్రకారం ఈ నెలాఖరు వరకు మొక్కజొన్న, కందిలాంటి పంటలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. కానీ పంట చివరి కాలంలో నీటి ఎద్దడి దృష్ట్యా సాగు చేసే అవకాశం చాలా తక్కువగా ఉందనే చెప్పొచ్చు. ఇక వరిపై మాత్రం కొంత ఆశలు ఉన్నప్పటికీ, కాలువల కింద వానాకాలం సాగు వరదపై ఆధారపడి ఉంది. ఇప్పటివరకు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు చుక్కనీరు రాలేదు. ఆగస్టు మొదటివారం వరకు వరద పరిస్థితి ఇలాగే ఉంటే జూరాల కింద వానాకాలం క్రాప్‌హాలిడే ప్రకటించే అవకాశం ఉంది. వరిపై రైతులు కొంచెం ఆశతో ఉన్నారు. అత్యంత ఎక్కువ వరి సాగుచేసే వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 10,582 ఎకరాల్లో మాత్రమే సాగైంది.
మొక్కజొన్న, కంది అంతంతే..
గతేడాది ఉమ్మడి జిల్లాలో అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగైంది. ఒక్క నారాయణపేట మినహా మిగతా జిల్లాలో భారీగా పెరిగి 1.39 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. ఈ ఏడాది కేవలం 24,263 ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న వేశారు. గతేడాదితో పోల్చితే కేవలం 17.38 శాతం మాత్రమే మొక్కజొన్న సాగు అయ్యింది. 82.62 శాతం రైతులు వర్షాభావం కారణంగా పంట సాగు చేయలేదు. కంది విషయానికి వస్తే గతేడాది సుమారు 1.02 లక్షల ఎకరాల్లో ఉమ్మడి జిల్లాలో చేస్తే.. ఈ ఏడాది ఇప్పటివరకు 48,805 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ నెలాఖరు వరకు ఈ పంట విత్తుకోవడానికి అవకాశం ఉంది. కానీ రైతుల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. గతేడాదితో పోల్చితే 50 శాతం కంటే ఎక్కువగా కంది విస్తీర్ణం తగ్గింది. వర్షాభావ పరిస్థితి నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కంది రైతులపై ఎక్కువగా పడిందని చెప్పవచ్చు. ఇక వేరుశనగ 19,376 ఎకరాల్లో సాగు కాగా.. ఈ ఏడాది ఎక్కడా సాగు జాడ కనిపించడం లేదు. ఒకవేళ ఆగస్టు, సెప్టెంబరులో వర్షాలు కురిస్తే ముందస్తు యాసంగిలో వేరుశనగ సాగు పెరిగే అవకాశం ఉంటుంది. పెసర, ఆముదం, జొన్న తదితర పంటల సాగు చాలా సూక్ష్మ విస్తీర్ణంలో ఉంది. మొక్కజొన్న, కంది పంటలకు అధికారిక అంచనాల ప్రకారం నెలాఖరు వరకు అవకాశం ఉన్నా.. రైతాంగం మాత్రం పంట చివరిలో వర్షాభావ పరిస్థితి ఉంటే కష్టమనే భావనలో ఉన్నారు.
పత్తి తగ్గింది..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది రెండో ప్రధాన పంట అయిన పత్తి సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 8,13,403 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,89,167 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇప్పుడు ఇక విత్తుకునే కాలం దాదాపు ముగిసినట్లే. గతేడాదితో మిగతా పంటలను పోల్చితే 70 శాతం వరకు సాగైంది పత్తి మాత్రమే. అయినప్పటికీ 2.24 లక్షల ఎకరాల మేర పత్తిసాగు తగ్గింది. ఇక వరి విషయానికి వస్తే ఇప్పటికే సాగు ప్రారంభమైనా, ఆగస్టు చివరి వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులకు వరద లేదు. ఉన్న నీటిని కచ్చితంగా తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచుతారు. ఎగువన ఉన్న ఆలమట్టి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నప్పటికీ ప్రాజెక్టు నీటినిల్వ సగానికి మాత్రమే చేరుకుంది. దాని తర్వాత నారాయణపూర్ కూడా నిండాల్సి ఉంది. ఆగస్టు వరకు వరద రాకుంటే క్రాప్‌హాలిడే ప్రకటిస్తామని సంయుక్త సమావేశంలో ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం రైతులపై ఈ ఏడాది భారీగా పడటం ఖాయంగానే కనిపిస్తోంది.
రెండుసార్లు పత్తి విత్తి నష్టపోయా
ఆరు ఎకరాల్లో పత్తి పంట విత్తిన. వర్షాలు లేక మొలకలు రాకపోవడంతో రెండు సార్లు విత్తనాలు వేశా. మొదటిసారి 28 ప్యాకెట్లు రూ.23,500 చెల్లించి కొనుగోలు చేశా. రెండో సారి 8 ప్యాకెట్లు రూ.3,200 పెట్టి కొన్నా. విత్తనాలకు, కూలీలకు, కలుపు తీసేందుకు రూ.52 వేలు పెట్టుబడి పెట్టా. వర్షాలు లేక మొలకలు ఎండుతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.
- సి.రమేష్, రైతు, బిజ్వార్, ఊట్కూర్ మండలం
తుకమే పోయలే
ఏటా జూలైలో వరి నారుమళ్లు సిద్ధం చేసేవాళ్లం. ఈ సీజన్‌లో ఒక్క వాన కూడా సమృద్ధిగా పడలేదు. ఎప్పుడూ 6 ఎకరాల్లో వరి సాగు చేస్తుంటి. ఈ సారి తుకం కూడా పోయలే. ఇటువంటి వర్షభావ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. జొన్న, కంది, మొక్కజొన్న పంటలు ఎండుతున్నాయి. ఈ నెలలో వర్షాలు పడకుంటే వర్షాకాలం లేనట్లే. రైతులకు కష్టాలే ఉంటవి.
- రాజు, రైతు, గుడిమల్కాపూర్, హన్వాడ మండలం
వారంలో వర్షం కురవకుంటే కష్టమే
ఈ వానాకాలంలో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలే. విత్తనాలు మొలకెత్తలేదు. నెల రోజులుగా వానలు లేక పత్తి, మిర్చి, కంది విత్తనాలు భూమిలోనే ఉన్నాయి. పత్తి విత్తనాలు మురిగిపోతున్నాయి. అడపదడప మొలకెత్తిన మొలకలు ఎండుతున్నాయి. మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వారంలో వర్షం కురవకుంటే వానాకాలం పంటలు కష్టమే.
- మనోహర్ రెడ్డి, రైతు, మానవపాడు