Share News

ఉపాధి హామీ దక్కేనా

ABN , Publish Date - Mar 23 , 2026 | 10:59 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రోజురోజుకూ నిర్వీర్యం అవుతోంది. ఇప్పటికే పూర్తిగా కేం ద్రం ఆధీనంలోకి వెళ్లిన పథకంలో గుర్తించిన పనులు మినహా కొత్తవి చేయకుండా చట్టం చే శారు. దాంతో పనుల రకాల సంఖ్య తగ్గిపోయింది.

ఉపాధి హామీ దక్కేనా
మిడ్జిల్‌లో ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలు

ఏడాదిలో 43 శాతం తగ్గిన ఉపాధి పనులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.285.41 కోట్లు ఖర్చు

గత ఏడాది 500.32 కోట్లు..

ఏప్రిల్‌ నుంచి కొత్త ప్రణాళిక

మహబూబ్‌నగర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రోజురోజుకూ నిర్వీర్యం అవుతోంది. ఇప్పటికే పూర్తిగా కేం ద్రం ఆధీనంలోకి వెళ్లిన పథకంలో గుర్తించిన పనులు మినహా కొత్తవి చేయకుండా చట్టం చే శారు. దాంతో పనుల రకాల సంఖ్య తగ్గిపోయింది. ఇక బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ కోతలు విధించడం వల్ల రానురాను పథకం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 43 శాతం మేర పనులను కుదించారు. నిధుల ఖర్చు కూడా గతంతో పోలిస్తే చాలావరకు తగ్గింది. కరోనా కాలంలోనూ బడ్జెట్‌ కేటాయింపులు జరగగా ఈ సంవత్సరం దాదాపు పనులు, నిధుల ఖర్చు తగ్గిపోవడంతో పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నందున సిబ్బంది పనులను గుర్తించే పనిలో ఉన్నారు.

అవగాహన కుదిరేనా?

ఏడాదిపాటు చేయాల్సిన పనులకు సంబంధించి ముందుగా యాక్షన్‌ప్లాన్‌ చేస్తారు. ఏ గ్రామంలో ఎన్ని పనిదినాలు చేయాలి?, ఏమేం పనులు చేయాలి?, ఎంత బడ్జెట్‌ అనేది ముందుగానే సంవత్సరానికి బడ్జెట్‌ తయారుచేస్తారు. కేంద్రం కొత్తగా ఇఫ్తదార్‌ అనే సైట్‌ను తెచ్చింది. అందుకు కేవలం పనిచేయాల్సిన ప్రదేశం, ఫలానా పని అని మాత్రమే గుర్తించి ప్రణాళిక తయారు చేయాలి. ఏప్రిల్‌ 1 తరువాత ఆయా పనులకు ఎంత బడ్జెట్‌ అనేది నిర్ణయం అవుతుంది. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం పథకం కింద 10 శాతం బడ్జెట్‌ కేటాయిస్తే కేంద్రం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చేది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మాత్రం రాష్ట్రం నుంచి 40 శాతం ని ఽధులు ఇస్తే తాము 60 శాతం ఇస్తామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ అలయెన్స్‌తో నడుస్తున్న రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదనకు ఓకే చెప్పి నా, తెలంగాణలో మాత్రం అభ్యంతరం తెలిపారు. తా ము 40 శాతం బడ్జెట్‌ కేటాయించబోమని, ఏప్రిల్‌ మాసానికి మాత్రం ఇంతకుముందులానే 10 శాతం బడ్జెట్‌ పెడుతూ ప్రణాళికను పం పించినట్లు తెలిసింది. మరికేంద్రం నిధులు కేటాయిస్తుందా? లేదా అన్నది ఆర్థిక సంవత్సరం మొదలైతేనే స్పష్టత రానుంది.

పనులు, నిధుల్లో కోత

గతంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులు సగానికి తగ్గిపోయాయి. పాలమూరులాంటి జిల్లాలో లేబర్‌ ఎక్కువగా ఉండటంతోపాటు ఉపాధిహామీ పథకంపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పథకం నిర్వీర్యమైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో లేబర్‌ పేమెంట్‌ కోసం రూ.185.4 కోట్లు ఖర్చుచేశారు. అదే మెటీరియల్‌ పేమెంట్‌కు రూ.100.01 కోట్లు ఖర్చయ్యింది. 2024-25 సంవత్సరంలో ఉమ్మడి పాలమూరులో లేబర్‌ పేమెంట్‌ రూ.289.82 కోట్లు కాగా, మెటీరియల్‌ పేమెంట్‌ రూ.210.5 కోట్లు ఇచ్చారు. మరో వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. గతేడాదితో పోలిస్తే 43 శాతం పనులు, నిధులు తగ్గిపోవడం గమనా ర్హం. ఈ సంవత్సరం పనులు, నిధులు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నది మరో 15 రోజుల్లో తేలనుంది.

Updated Date - Mar 23 , 2026 | 10:59 PM