ప్రకటనలకే పరిమితమా..?
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:16 PM
ఎన్నికల సమయం లో నేతన్నలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్మికుల ఖాతాల్లో డబ్బులు మా త్రం జమ కావడం లేదు.
కోడ్ ముగిసినా.. రుణమాఫీకి నోచుకోని చేనేత కార్మికులు
రాజోలి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) :ఎన్నికల సమయం లో నేతన్నలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్మికుల ఖాతాల్లో డబ్బులు మా త్రం జమ కావడం లేదు. గత నెల 24న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఆయా జిల్లాల చేనేత, జౌళీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించారు. నారాయణపేట జిల్లా లో చేనేతశాఖ మంత్రి చేతుల మీదుగా రుణమాఫీ పత్రాల పంపిణీ చేశారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ నేరుగా బ్యాంకులకు రుణమాఫీ చెక్కులను జారీ చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. దీంతో 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్న లక్షలోపు రుణాలు మాఫీ కానున్నాయని నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. కానీ వారి ఆశలు నిరాశగానే మిగిలాయని వాపోతున్నారు. 2025 - డిసెంబరులోనే రుణమాఫీ నిధులు వచ్చినప్ప టికీ పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడం, వెంట నే సర్పంచు ఎన్నికల కోడ్ రావడంతో మొత్తం నిధులు వచ్చే వరకూ ఆపాలని జాప్యం జరిగింది. ఇటీవల మొత్తం నిధులు వచ్చినప్పటికీ మునిసిపల్ ఎన్నికలు రావడంతో జిల్లాలోని నేతన్నలను ఆకట్టుకునేందుకు ఎన్నికల కోడ్‌కు ముందుగా పట్టణ ప్రాంతాల్లోని వారి కే రుణమాఫీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినా రుణమాఫీ రుణ మాఫీ ఊసేత్తకపోవడంతో నేతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే మాఫీ చేయాలి..
బ్యాంకులో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. బ్యాంకు వాయిదాలు సక్రమంగా కట్టకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రస్తు తం ముడిసరుకుల ధరలు పెరిగిపోవడంతో తయారు చేసిన చీరకు లాభాలు అంతంతగానే ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంట నే రుణమాఫీ చేయాలి.
- బుట్ట ఈరన్న, రాజోలి చేనేత కార్మికుడు