కలుషిత ఆహారంపై విచారణ
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:20 PM
మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని, పలువు రు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ మంగళవారం స్పందించారు.
నంచర్ల గురుకుల పాఠశాలను పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీత
మహమ్మదాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని, పలువు రు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ మంగళవారం స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీత, గురుకులాల కోఆర్డినేటర్ వాణిశ్రీ, తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డిలను ఆదేశించారు. ఈ మేరకు వారు పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వంటగది, డార్మెట్రీలు, వాష్‌రూమ్, వెల్నెస్ సెంటర్‌లను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. సోమవారం ఉదయం ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా, వారిని మహమ్మదాబాద్ పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అరుణ చెప్పారని వారు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించినట్లు పేర్కొన్నారు.