ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:07 PM
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 35, నారాయణపేట జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 35, నారాయణపేట జిల్లాలో 15 కేంద్రాల ఏర్పాటు
రెండు జిల్లాల్లో 406 మంది గైర్హాజరు
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/ నారాయణపేట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 35, నారాయణపేట జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు కావడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మహబూబ్‌నగర్‌లో కేంద్రాలకు ఉదయం 8 గంటలకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో హాల్ టికెట్లకు విద్యార్థులు పూజలు చేయించారు. పరీక్షకు 11,366 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా.. 11,110 మంది హాజరయ్యారు. 256 మంది గైర్హాజరు అయ్యారు. కొన్ని కేంద్రాల్లో సమస్యలు నెలకొన్నాయి.
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ విజయేందిర బోయి
పరీక్ష కేంద్రాలను కలెక్టర్ విజయేందర బోయి, అధికారులు పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. జడ్చర్ల ఘటన మినహా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నయి.
సంస్కృతం పేపర్ బదులు హిందీ పేపర్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థికి సంస్కృతం ప్రశ్న పత్రం బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. విద్యార్థి కూడా గమనించకుండా పరీక్ష రాశాడు. ఈ ఘటనపై చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారికి డీఐఈఓ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఘటన పూర్తి వివరాలను బోర్డు అధికారులకు పంపించారు.
నారాయణపేట జిల్లాలో..
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,600 మందికి గాను 4,450 మంది పరీక్షలు రాశారు. 150 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 4,089 మందికి గాను 3,960 మంది హాజరు కాగా 129, ఒకేషనల్ విద్యార్థులు 511 మందికి గాను 490 మంది హాజరు కాగా, 21 మంది గైర్హాజరయ్యారు. నారాయణపేట వేద సరస్వతి జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీటి వసతిపై కళాశాల ప్రిన్సిపాల్ శేషమ్మను అడిగి తెలుసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, సిట్టింగ్ స్క్వాడ్స్ శివకుమార్, సత్యనారాయణ, కస్టోడియన్లు దత్తాత్రేయరావు, విజయలక్ష్మి నారాయణపేట, మక్తల్‌లలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. నారాయణపేట యాద గిరి రోడ్‌లోని గురుకుల జూనియర్ కళాశాల, చౌక్‌బజార్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను డీఎస్పీ లింగయ్య పర్యవేక్షించి, ఏర్పాట్లను పరిశీలించారు. 144 సెక్షన్ అమలుతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెల్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్ పరికరాలు కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.