Share News

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:26 PM

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో బుధవారం నుంచి మొదలు కానున్న ఇంటర్‌ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహించనున్నారు.

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
నారాయణపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నెంబర్లు వేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది

ఏర్పాట్లు చేసిన విద్యా శాఖ

మహబూబ్‌నగర్‌లో 35, నారాయణపేటలో 15 కేంద్రాల ఏర్పాటు

హాజరుకానున్న పాలమూరులో 21,884 మంది.. ‘పేట’లో 8,192 మంది విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం/నారాయణపేట, ఫిబ్రవరి (ఆంఽధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో బుధవారం నుంచి మొదలు కానున్న ఇంటర్‌ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 21,884 మంది, నారాయణపేట జిల్లాలో 8,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్ర భుత్వ జూనియర్‌ కళాశాలల్లో 17, ప్రభుత్వ సెక్టార్‌ జూనియర్‌ కళాశాలల్లో 3, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో 15 కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. విద్యార్థులకు తాగునీరు, వైద్యం సౌకర్యాలను కల్పించారు. ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 21,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధవారం నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం 10,859 మంది, ద్వితీయ సంవత్సరం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 2 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 3 కన్వీనర్‌ డీఈసీ బృందాలు, 6 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆరు మంది కస్టోడియన్లు 35 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 35 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. కలెక్టర్‌, డీఐఈఓ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.

నారాయణపేట జిల్లాలో..

నారాయణపేట జిల్లాలోని 13 మండలాల్లో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,409 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,783 మంది హాజరుకానున్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 15 మంది చీఫ్‌ సూరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, నలుగురు అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, ఇద్దరు కస్టోడియన్స్‌ను నియమించారు. అదే విధంగా ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం, ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందం, ఒక కన్వీనర్‌, ఇద్దరు డిస్టిక్‌ ఎగ్జామినేషన్‌ కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 24 , 2026 | 11:26 PM